తాడిపత్రి మున్సిపల్‌ పోరులో సై అంటే సై అంటున్న దాయాదులు

-

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులున్నాయి. దేశంలో నెంబర్ వన్ గా నిలిచిన మున్సిపాలిటీ. అంతకు మించి జేసీ బ్రదర్స్ కంచుకోట. ప్రస్తుతం ఇక్కడ మున్సిపల్ పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. గత నాలుగు దశాబ్దాలుగా జేసీ చేతిలో ఉన్న తాడిపత్రిలో గత ఎన్నికల్లో పెద్దారెడ్డి విజయం సాధించారు. జేసీ ఫ్యామిలీ ఓటమి తరువాత వచ్చిన మొదటి మున్సిపల్ ఎన్నికలు ఇవి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జేసీ ఫ్యామిలీ.. ఈ సారి మున్సిపాలిటీ ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అటు పెద్దారెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సై అంటే సై అంటున్నాయి రెండు వర్గాలు.


మున్సిపల్ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి . దీంతో ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా ముందుకెళ్తున్నారు. మన ఊరును మనం కాపాడుకుందామంటూ కొత్త నినాదంతో దూసుకెళ్తున్నారు.మరో వైపు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు 30వ వార్డు మెంబర్ గా పోటీలో ఉన్నాడు. ఎలాగో అధికార పార్టీ కావడంతో గెలుస్తామన్న నమ్మకంతో ఛైర్మన్ రేసులో ముందున్నాడు. అయితే రమేష్ రెడ్డి అనే మరో వైసీపీ నాయకుడు కూడా బరిలో ఉన్నారు. రమేష్ రెడ్డి జేసీ హవా ఉన్నప్పుడే తాడిపత్రిలో గెలిచి సత్తా చాటారు. ఇప్పుడు వైసీపీ మన్సిపాలిటీ జెండా ఎగురవేస్తే.. ఛైర్మన్ కావాలని చూస్తున్నారు.

ఇప్పుడు ఇదే విషయంపై వైసీపీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. అలకబూనిన నాయకులను బుజ్జగిస్తున్నారు. అయితే తాడిపత్రి మున్సిపాల్టీలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన రీతిలో గతంలో చేసిన అభివృద్ధి చూసి తమ అభ్యర్థులను గెలిపించాలంటున్నారు. ఇలా నామినేషన్లు వేయగానే గెలిచామన్నట్లుగా ఉన్న అధికార పార్టీలో అసంతృప్తిలను బుజ్జగించే పనిలో నాయకులు ఉన్నారు. పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వస్తాయని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు.

తాడిపత్రిలో ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో వైసీపీ ఆధిపత్యం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో గతంలో మున్సిపల్ ఛైర్మన్ గా తాడిపత్రి ఎమ్మెల్యేగా పని చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవంతో ఎన్నిక పై ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news