కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే..సీటుపై రేవంత్ హామీ?

-

తెలంగాణలో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుగా రాజకీయాలు చూస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇతర పార్టీల్లోని బలమైన నేతలని కాంగ్రెస్ లోకి తీసుకురావడంలో ముందున్నారు. ఇప్పటికే పలువురు బలమైన నేతలని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు. ఇదే క్రమంలో టి‌డి‌పి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు.

కొత్తకోట ఫ్యామిలీ మొదట నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో టి‌డి‌పి కోసం పనిచేశారు.  అమరచింత నియోజకవర్గం నుంచి దయాకర్‌రెడ్డి 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజక వర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్‌ నుంచి గెలుపొందారు. దయాకర్ రెడ్డి భార్య సీతా దయాకర్ రెడ్డి 2002లో మహబూబ్ నగర్ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగా ఏర్పాటైన  నియోజకవర్గం దేవరకద్ర నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే 2018 ఎన్నికల్లో దయాకర్ టి‌డి‌పి నుంచి మక్తల్ లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక తర్వాత తెలంగాణలో టి‌డి‌పి మరింత దెబ్బతినడంతో కాస్త రాజకీయాలకు దూరమయ్యారు. ఇదే సమయంలో దయాకర్ రెడ్డి అనారోగ్యంతో మరణించారు. అప్పుడు చంద్రబాబు సైతం వచ్చి..దయాకర్ ఫ్యామిలీకి అండగా నిలిచారు. కానీ టి‌డి‌పి పరిస్తితి బాగోకపోవడం..అటు అదే టి‌డి‌పిలో గతంలో పనిచేసి ఇప్పుడు టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఆహ్వానంతో సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆమె కుమారులు కొత్త కోట సిద్ధార్థ రెడ్డి , కార్తీక్ రెడ్డి తోపాటు పెద్ద సంఖ్యలో ఆమె అనుచరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

దయాకర్ రెడ్డి కుటుంబానికి మక్తల్, దేవరకద్రల్లో పెద్ద ఎత్తున అభిమానులు, మద్దతుదారులు ఉన్నారు. ఇక ఆమెకు రేవంత్ సీటు హామీ ఇచ్చారనే ప్రచారం ఉంది. కానీ మక్తల్, దేవరకద్రలో సీటు కోసం కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీతా దయాకర్ రెడ్డికి సీటు దక్కుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news