గోరంట్ల బుచ్చయ్యతో ‘సైకిల్‌’కు డ్యామేజ్ అవుతుందా!

-

తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలని మార్చేశారని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక టీడీపీ ఇప్పుడుప్పుడే పుంజుకుంటుంది. అలాగే అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. అటు చంద్రబాబు, లోకేష్‌లు ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉదృతం చేశారు. టీడీపీ నేతలు కూడా దూకుడుగా అధికార వైసీపీపై పోరాటానికి సిద్ధమవుతున్నారు.

ఇలాంటి తరుణంలో టీడీపీలో బుచ్చయ్య బాంబ్ పేలింది. టీడీపీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని, కార్యకర్తలకు సరైన న్యాయం జరగడం లేదని, చంద్రబాబు, లోకేష్‌లకు చెప్పిన పట్టించుకోవడం లేదని, ఆఖరికి తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని, అందుకే తాను టీడీపీని వీడుతున్నట్లు బుచ్చయ్య ప్రకటించారు. టీడీపీని వీడటమే కాదు…ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బుచ్చయ్య చెప్పారు.

అయితే ఇప్పుడుప్పుడే పికప్ అవుతున్న టీడీపీకి బుచ్చయ్య ఎపిసోడ్ పెద్ద డ్యామేజ్ చేస్తుందా? అంటే కొంతవరకు బుచ్చయ్య అంశం పార్టీకి ఇబ్బందికరమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే బుచ్చయ్య ఆవేదనలో అర్ధముందని, ఆయన ఏమి పదవుల కోసం అసంతృప్తిగా లేరని, పార్టీని బాగు చేయట్లేదనే ఆవేదన చెందుతున్నట్లు కనబడుతోందని అంటున్నారు. వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం, ఎప్పటినుంచో పార్టీలో ఉంటున్నవారిని పట్టించుకోకపోవడం, సబ్జెక్ట్ తెలియనివారు అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలని సీనియర్లకు గైడెన్స్ ఇవ్వడం, అలాగే కొందరి వల్ల పార్టీకి కార్యకర్తలు దూరమవుతున్నారని, వారికి న్యాయం చేయాలని అధినేతకు చెప్పిన పట్టించుకోకపోవడం లాంటి అంశాలు బుచ్చయ్యని బాగా ఇబ్బంది పెట్టాయని చెప్పొచ్చు.

వాటికి పరిష్కారం చూపడం లేదు కాబట్టే బుచ్చయ్య పార్టీని వీడాలని అనుకుంటున్నారు. అయితే పార్టీ పికప్ అవుతున్న సమయంలో బుచ్చయ్య లాంటి వారి ఆవేదనని తగ్గించి, ఆయన లాంటి నాయకులకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చి, పార్టీకి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుదే. మరి చంద్రబాబు ఆ దిశగా పనిచేసి, టీడీపీకి జరిగే డ్యామేజ్‌ని ఆపుతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news