ప్రస్తుతం విశాఖలో కబ్జాల రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉండగా పలువురు టీడీపీ నేతలు ప్రభుత్వ భూములని ఆక్రమించుకుని, అక్రమ కట్టడాలని కట్టారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు టార్గెట్‌గా వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. గతంలో పల్లా వందలకోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములని ఆక్రమించుకున్నారని, వాటిని పలు ప్రైవేట్ సంస్థలకు లీజుకు కూడా ఇచ్చారని చెబుతున్నారు.
అలాగే పలుచోట్ల అక్రమ కట్టడాలని కట్టారని ఆరోపిస్తున్నారు. ఇక వాటిపై విచారణ చేసి, ప్రభుత్వ భూములని వెనక్కి తీసుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే పల్లాకు చెందిన పలు ఆస్తులని అక్రమ కట్టడాలని కూల్చేస్తున్నారు. అయితే ఇలా కబ్జాల ఆరోపణలు పెరగడంతో పలువురు టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. పల్లాకు మద్ధతుగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఒక్కరే మాట్లాడుతున్నారు.
అటు గంటా శ్రీనివాసరావుగానీ, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గానీ నోరు ఎత్తడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వీరిపై వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. అలాగే వెలగపూడిపై కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ వెలగపూడి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పల్లాకు మద్ధతుగా నిలబడ్డారు. వైసీపీలోకి రానందుకే తనపై కక్ష సాధిస్తున్నారని పల్లా అంటున్నారు.
ఇక విశాఖ టీడీపీలో కీలకంగా ఉన్న బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ సైతం సైలెంట్‌గానే ఉన్నారు. గతంలో భరత్ ఛైర్మన్‌గా ఉన్న గీతం విద్యాసంస్థలని సైతం వైసీపీ టార్గెట్ చేసింది. అప్పటిలో అక్రమంగా కట్టారని గీతం గోడని కూల్చేశారు. ఇక కూల్చివేతల నేపథ్యంలోనే బాలయ్య చిన్నల్లుడు సైతం సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. అసలు విశాఖలో ఆ రేంజ్‌లో పల్లాని వైసీపీ టార్గెట్ చేసిన, బాలయ్య చిన్నల్లుడు మాత్రం నోరు మెదపడం లేదు. ఒకవేళ తిరిగి మాట్లాడితే ఎక్కడ తనపైనా ఆరోపణలు చేస్తారేమో అని శ్రీ భరత్ సైడ్ అయినట్లు తెలుస్తోంది.