ఏపీలో అధికార టీడీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన చాలామంది నేతలు టీడీపీని వీడి వైఎస్సాఆర్సీపీలో చేరారు. ఎంపీలు, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలు.. ఇలా చాలామంది నేతలు వైఎస్సాఆర్సీపీ బాట పట్టారు. తాజాగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట.
ఆమె.. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కర్నూలు ఎంపీగా గెలిచారు. తర్వాత ఆమె టీడీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆమె ఇవాళ కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ జగన్ ను కలవనున్నారు.
అయితే.. ఈసారి ఆమెకు కర్నూలు నుంచి ఎంపీ టికెట్ దక్కకపోవడం వల్లనే టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడంతో… కర్నూలు ఎంపీ టికెట్ ను టీడీపీ.. ఆయనకు కేటాయించింది. దీంతో చంద్రబాబు.. బుట్టా రేణుకకు మొండిచేయి చూపించారు. అయితే.. ఆమెను ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చంద్రబాబు సూచించినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ఈ విషయంలో తీవ్ర మనస్థాపానికి గురైన రేణుక.. వైఎస్సాఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఆమె ఇవాళ వైఎస్ జగన్ ను కలిసి నిర్ణయం తీసుకోనున్నారు.