నా రక్తంలోనే భయం లేదు.. నిండు సభలోనే మోదీని నిలదీసిన వ్యక్తిని: ఎంపీ కేశినేని నాని

నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని.
ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు.
నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం.
నిజాన్ని నిజమని చెబుతాను.
అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను.
మంచిని మంచి అనే అంటాను.
చెడును చెడు అనే అంటాను.
న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను.
అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను.
ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని.
నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను.
నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని.
భయం నా రక్తంలో లేదు.
రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు.
ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదు..
అంటూ విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఇదివరకు కూడా ఆయన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. తనకు లోక్ సభ విప్ పదవిని చంద్రబాబు ఇవ్వగా.. తనకు ఆ పదవులేవీ వద్దని కేశినేని నాని సున్నితంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించారు. అయితే.. ఆ పోస్ట్ టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమను ఉద్దేశించే పెట్టారని రాజకీయ విశ్లేషకులు, టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

అయితే.. నాని టీడీపీని వీడి బీజేపీలో చేరుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాని ఇటువంటి పోస్టులు పెట్టడం సంచలనంగా మారింది.