ఆన్‌లైన్‌లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్(ఆర్‌టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్)ల రూపంలో ప్రస్తుతం అనేక మంది బ్యాంకింగ్ కస్టమర్లు ఆన్‌లైన్‌లో నగదు బదిలీలు చేసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఇకపై ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేస్తే ఎలాంటి చార్జిలు ఉండవు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిన్న ఒక కీలక ప్రకటన చేసింది. దేశంలో డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు గాను ఆర్‌బీఐ ఆన్‌లైన్ నగదు బదిలీలపై చార్జిలను ఎత్తివేయాలని నిర్ణయించింది. దీంతో వచ్చే నెల 1వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమలు కానుంది.
ఆన్‌లైన్‌లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్(ఆర్‌టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్)ల రూపంలో ప్రస్తుతం అనేక మంది బ్యాంకింగ్ కస్టమర్లు ఆన్‌లైన్‌లో నగదు బదిలీలు చేసుకుంటున్నారు. అయితే ఇందుకు గాను ఆయా బ్యాంకులు కొంత మేర చార్జిలను కూడా వసూలు చేస్తున్నాయి. సాధారణంగా ఈ రెండు తరహా లావాదేవీలకు ఆర్‌బీఐ బ్యాంకుల నుంచి కొంత రుసుమును వసూలు చేస్తుంటుంది. అయితే రుసుమును బ్యాంకులు కస్టమర్ల నుంచి వసూలు చేస్తుంటాయి. అయితే ఆర్‌బీఐ ఈ చార్జిలను ఎత్తివేయడంతో ఇకపై కస్టమర్లపై కూడా ఈ చార్జిలు పడవు.
కాగా ప్రస్తుతం ఎస్‌బీఐ నెప్ట్ లావాదేవీలకు రూ.1 నుంచి రూ.5 వరకు, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది. అయితే ఈ చార్జిలను ఇకపై రద్దు చేయనున్న నేపథ్యంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి వినియోగదారులు ఎలాంటి చార్జిలు లేకుండానే ఈ రెండు రకాల లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఇక ఐఎంపీఎస్ విధానంలో జరిగే లావాదేవీలపై విధించే చార్జిలపై ఆర్‌బీఐ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయినప్పటికీ ప్రస్తుతం ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల అనేక మందికి లాభం కలగనుంది..!