ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో చివరి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయులు ప్రకటించారు. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠకు ఈ జాబితాతో తెరపడింది.మంత్రి బొత్సను ఓడించేందుకు చంద్రబాబునాయుడు అనేకవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. చీపురుపల్లిలో బలమైన నేతలను దించాలని చివరి వరకు ప్రయత్నించి ఎవరూ ముందుకురాకపోవడంతో కళా వెంకట్రావ్‌ను రంగంలోకి దించారు.
బొత్స లాంటి బలమైన నేతను ఢీకొట్టే శక్తియుక్తులు తన దగ్గర లేవని మొదటినుంచి కళా వెంకట్రావ్ చెప్తున్నా చివరికి అతనికే అవకాశం కల్పించారు చంద్రబాబు. కళా వెంకట్రావ్ స్థానికేతరుడు కావడంతో మరోసారి ఇక్కడ బొత్స సత్యనారాయణ విజయం లాంఛనంగా కనిపిస్తోంది.అటు వెంకట్రావ్ కూడా తన ఓటమిని ముందుగానే ఒప్పుకున్నట్లు సమాచారం.వద్దని ఎంతగా చెప్పినా అధినేత తనను బలవంతంగా చీపురుపల్లి నుంచి పోటీ చేయిస్తున్నారని తన అనుచరుల వద్ద కళా వెంకట్రావ్ బాధను చెప్పుకొచ్చారని తెలుస్తోంది. మొత్తానికి అధినేత పంతానికి కళా వెంకట్రావ్ ఇక్కడ బలి అవుతున్నారు.
పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా ప్రకటించిన జాబితాల్లో 13 ఎంపీ, 135 మంది ఎమ్మెల్యే అభ్యర్దులను ఖరారు చేసారు. ఒక తుది జాబితాలో 4 ఎంపీ, 9 మంది ఎమ్మెల్యే అభ్యర్దులను ప్రకటించారు.ఎంపీ స్థానాల్లో విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడును బరిలోకి దించారు.ఒంగోలు నుంచి తొలుత మాగుంట తనయుడు రాఘవరెడ్డి పేరు వినిపించినా లిక్కర్ కేసు కారణంగా తిరిగి మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరును ప్రకటించక తప్పలేదు.అనంతపురం నుంచి అనూహ్యంగా అంబికా లక్ష్మీనారాయణ పేరును ఖరారు చేశారు.
కడప నుంచి భూపేష్ రెడ్డికి అవకాశం కల్పించారు. భూపేష్ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం ఇంఛార్జ్ గా ఉన్నారు.అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లటంతో అక్కడ ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు.దీంతో భూపేష్ రెడ్డికి కడప పార్లమెంట్‌ను కేటాయించారు. పెండింగ్ లో ఉన్న తొమ్మది ఎమ్మెల్యే స్థానాల్లో…..చీపురుపల్లి నుంచి టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరును ప్రకటించారు. పాడేరు నుంచి కిల్లు రమేష్ నాయుడు ను అభ్యర్దిగా టీడీపీ అధినేత ఖరారు చేశారు.
దర్శి నుంచి గొట్టిపాటి లక్ష్మీని బరిలో దించుతున్నారు. తొలుత ఈ సీటును మాజీమంత్రి సిద్దా రాఘవరావు కుటుంబానికి ఇవ్వాలని భావించారు. కానీ, సిద్దా ఇటీవల సీఎం జగన్ తో భేటీ అయిన కారణంతో చంద్రబాబు నిర్ణయం మార్చుకున్నారు. రాజంపేట నుంచి సుగవాసి సుబ్రమణ్యం, ఆలూరు నుంచి వీరభద్ర గౌడ్, గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం పేర్లు ప్రకటించారు. గుంతకల్ లో టీడీపీ నుంచి ముగ్గురు నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జయరాంకు ఈ సీటును ఖాయం చేయడంతో మిగతా ముగ్గురు రెబెల్స్‌గా బరిలో దిగేందుకు యోచిస్తున్నారు. అదే జరిగితే గుమ్మనూరు జయరామ్ తగిన మూల్యం చెలించుకోకతప్పదు.అదే విధంగా..అనంతపురం నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరు ప్రకటించారు.
కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్ పేరును ఖరారు చేసారు. దీని ద్వారా టీడీపీ నుంచి పోటీ చేసే మొత్తం 17 మంది ఎంపీ, 144 మంది అభ్యర్దుల పేర్లను టీడీపీ అధికారికంగా ప్రకటించినట్లయింది.సీటు దక్కక ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు ఏపీ వ్యాప్తంగా తిరుగుబాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ లిస్ట్ తరువాత కూడా అవి కొనసాగేలా కనిపిస్తున్నాయి.పొత్తుల్లో భాగంగా సీనియర్‌లను కాదని కాదని చాలాచోట్ల చంద్రబాబు అభ్యర్ధులను మార్చడంతో అటు కార్యకర్తలు సైతం తలలు పట్టుకుంటున్నారు.అధికార వైసీపీ మాత్రం విజయోత్సాహంతో ప్రచారపర్వంలో దూసుకుపోతోంది.