ఏపీలో అధికారం చేపట్టిన కూటమి చక చక మార్పులు చేస్తోంది.అలాగే స్థానిక సంస్థలపై పట్టు సాధించాలని చూస్తోంది.ఐదేళ్లుగా ఎక్కడ చూసినా వైసీపీ డామినేషన్ కనిపించింది. మునిసిపాలిటీల్లో , మండలాల్లో ఆ పార్టీకి చెందిన వారే ఎక్కువగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి ఎన్నికైన వారు తక్కువగానే ఉన్నారు.
అటు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ ని మార్చేసే మూడ్ లో ఉంది తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగా తొలి ఆపరేషన్ కర్నూల్ నుంచి మొదలు పెట్టబోతోంది. అక్కడ మేయర్ గా వైసీపీ కి చెందిన రామయ్య కొనసాగుతున్నారు. ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
కర్నూలు నగరం అభివృద్ధి చెందాలంటే నగర పాలక సంస్థపై పెత్తనం సాధించాలి. ప్రస్తుతం నగర మేయర్ గా వైసీపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. మొత్తం 52 డివిజన్లకు గానూ 9 మినహా అన్నింటిలోనూ వైసీపీ అభ్యర్థులే గెలిచారు.19వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన రామయ్య మేయర్‌గా కొనసాగుతున్నారు. డిప్యూటీ మేయర్ గా సిద్ధారెడ్డి రేణుక వ్యవహరిస్తున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అందరూ టీడీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ గెలవడమే కాకుండా కేబినెట్‌లో మంత్రి పదవి కూడా దక్కింది. మంత్రి నగరానికి వచ్చిరాగానే వెంటనే నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించారు. దీనిని బట్టి చూస్తే కచ్చితంగా నగరపాలక సంస్థపై పట్టు సాధించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందనే విషయం స్పష్టం అవుతుంది.
కర్నూల్ నగరపాలక సంస్థలో ఉన్న 52 మంది కార్పొరేటర్లలో టీడీపీకి 9, వైసీపీకి 43 మంది ఉన్నారు.మొన్నటి ఎన్నికలకు ముందే 17, 22 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు టీడీపీలో చేరారు.ఫలితాల తర్వాత 3,4,6,13 డివిజన్లకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు కూడా తెలుగుదేశంలో చేరిపోయారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరో ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు ఆపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం టీడీపీ కార్పొరేటర్ల సంఖ్య 18 కి చేరుకుంది.
మరో 11 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.ఈ 11 మంది కార్పొరేటర్లు ఇటీవల ఓ హోటల్లో రహస్యంగా చర్చలు జరిపి టీడీపీలోకి వెళ్లేందుకు తేదీ కూడా నిర్ణయించుకున్నారట.అటు మంత్రి భరత్ కూడా చక్రం తిప్పడంతో రానున్న రోజుల్లో కర్నూలు మేయర్ పీఠంపై మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ మున్సిపాలిటీలతోపాటు గూడూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, బేతంచెర్ల తదితర నగర పంచాయతీలలో కూడా మార్పు తేవాలని టీడీపీ ముఖ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.