వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తెలంగాణా కాంగ్రెస్ నానా కష్టాలు పడుతుంది. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆ పార్టీకి కాస్త అనుకూలంగా ఉందనే భావనలో ఉన్న అధిష్టానం.. కర్ణాటక ఫార్ములాని అమలు చేయాలని భావిస్తుంది. అందుకోసం కర్ణాటక కాంగ్రెస్ కు కీలకంగా వ్యవహరించిన సునీల్ కనుగోలుని తెలంగాణాలో కూడా రంగంలోకి దించింది. ఇందిరా భవన్ లో కాంగ్రెస్ వార్ రూమ్ ఏర్పాట్లకు కసరత్తు చేస్తున్నారు. ఇందిరా భవన్ ను పరిశీలించిన ఏఐసీసీ సెక్రెటరీ మన్సూర్ అలీ ఖాన్, మల్లు రవి, ప్రీతం… పలు సూచనలు చేసారు.
వార్ రూమ్ ఇంఛార్జిగా మాజీ ఐఏఎస్ శశికాంత్ సెంథిల్ కుమార్ వ్యవహరిస్తున్నారు. సునీల్ కనుగోలు రాజకీయ వ్యూహకర్త అయితే గనుక సెంథిల్ వార్ ఇంచార్జి గా వ్యవహరిస్తారు. ఈ నేపధ్యంలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపులో కీలకంగా పనిచేసిన సెంథిల్… తెలంగాణాలో కూడా చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారు. తెలంగాణ లో సైతం సెంథిల్ ఐడియాలజీ వాడుకోవాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుని… ఆయన్ను రంగంలోకి దించింది. సునీల్ వ్యూహాలు అమలు మొత్తం వార్ రూమ్ నుంచే జరగనుంది.
150 నుండి 200 మంది ఉద్యోగులతో వార్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క అసెంబ్లీ ఒక్కొక్క కో ఆర్డినేటర్ ఉండనున్నారని తెలుస్తుంది. వ్యూహాలు, ఎత్తులు పైఎత్తులన్నీ వార్ రూమ్ నుండి సాగనున్నాయి అని తెలుస్తుంది. త్వరలోనే సిస్టమ్స్, సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కు గాంధీ భవన్, ఏపీ కాంగ్రెస్ కు ఇందిరా భవన్ కేటాయించగా… ఇందిరా భవన్ ఖాళీగా ఉండడంతో ఇందిరా భవన్ ను వార్ రూమ్ గా వాడుకునేందుకు రెడీ అయ్యారు.