ఈటల రాజేందర్ వ్యవహారం అనేక మలుపులు తిరిగి చివరకు బీజేపీ గూటికి వెల్లింది. ఇప్పటికే ఆయన రాష్ట్ర బీజేపీ నేతలను కలిసి, అనంతరం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ జేపీ నడ్డాను కలిసి పార్టీ పరమైన హామీ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈటల వ్యవహారంపై టీఆర్ఎస్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
ఆయనపై పార్టీ పరమైన చర్యలు తీసుకోవడానికి ఇదే కరెక్టు టైమ్ అని కేసీఆర్ వర్గం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు బలమైన కారణం లేకుండా పార్టీ పరమైన చర్యలు తీసుకుంటే ఆయనకు ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని టీఆర్ఎస్ అధిష్టానం భావించింది.
కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉంటూ బీజేపీ నేతలను కలస్తుండటంతో.. దీన్ని కారణంగా చూపి కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే నిన్న కేసీఆర్ టీమ్ సభ్యుడైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతోంది.