ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముగ్గురు టీడీపీ సభ్యులను ఇవాళ సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో టీడీపీ శాసనసభాపక్ష ఉప నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు ఉన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడిగా, వేడిగా కొనసాగుతున్న విషయం విదితమే. అధికార, ప్రతిపక్ష పార్టీలకు పరస్పరం విమర్శలు చేసుకోవడమే సరిపోతోంది. మీరాపని చేశారంటే.. మీరలా చేశారని టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం తాము సభలో ప్రవేశపెట్టే ముఖ్యమైన బిల్లులకు పలువురు టీడీపీ సభ్యులు పదే పదే అడ్డు పతున్నారని చెప్పి వారిని ఇవాళ సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముగ్గురు టీడీపీ సభ్యులను ఇవాళ సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో టీడీపీ శాసనసభాపక్ష ఉప నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు ఉన్నారు. వీరిని సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో సస్పెన్షన్ అనంతరం ఈ ముగ్గురినీ మార్షల్స్ అసెంబ్లీ నుంచి బయటకు తీసుకువచ్చారు. అయితే సభ నుంచి బయటకు వచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో ఇలాంటి దురదృష్టకర చర్యలను చూడలేదన్నారు. ప్రభుత్వం కను సన్నల్లో స్పీకర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. 23 మంది ప్రతిపక్ష సభ్యులకే ఏపీ ప్రభుత్వం భయపడుతుందన్నారు.
అయితే సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై అటు సీఎం జగన్ సభలో స్పందించారు. తాము ప్రవేశపెడుతున్న గొప్ప పథకాలను అడ్డుకునేందుకే టీడీపీ సభ్యులు అలా వ్యవహరిస్తున్నారని అన్నారు. తమ పథకాలతో ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న భయంతోనే వారు ముఖ్యమైన బిల్లులకు సంబంధించి జరుపుతున్న చర్చలకు అడ్డు తగులుతున్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఎంత అడ్డుపడ్డా ఎన్నికల్లో తాము ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఎంత కష్టమైనా సరే.. నెరవేరుస్తామని స్పష్టం చేశారు.