తిరుపతిలో ఫ్యాను సునామీ సృష్టించింది. ఎలాంటి శషబిషలకు తావివ్వకుండా బంపర్ మెజార్టీతో జెండా ఎగరేసింది. ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తికి ఏకంగా 6,25,644ఓట్లు వచ్చాయి. గతం కంటే ఎక్కువ మెజార్టీతో వైసీపీ దుమ్ము లేపింది. దీంతో ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని మరోసారి రాష్ట్రానికి సంకేతం ఇచ్చినట్టయింది. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఓట్ల వర్షం కురిపించారు తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి.
ఇక ముందు నుంచి ఆరోపణలు చేస్తూ కోర్టు మెట్లెక్కిన బీజేపీ, టీడీపీ పత్తా లేకుండా పోయాయి. ఆ రెండు పార్టీలు కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. ఒక్క రౌండ్ లో కూడా ఆధిక్యం ప్రదర్శించలేకపోయాయి. వైసీపీ దూకుడు ముందు చిన్నబోయాయి. కోర్టు ఫలితం వైసీపీకి అనుకూలంగా వచ్చినప్పుడే టీడీపీ, బీజేపీ గెలుపుపై ఆశలు వదులుకున్నాయిన తెలుస్తోంది. స్వయంగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ ఫలితం పూర్తిగా రాకముందే.. తాను ఓడిపోతానని తనకు ముందే తెలుసని చెప్పడం విశేషం. లక్ష్మీ రెండో స్థానంలో నిలిచింది. ఆమెకు 3,54,253ఓట్లు పోలయ్యాయి.
ఇక ఎన్నో అంచనాలతో బరిలో దిగిన బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. మూడో స్థానంలో నిలిచి తక్కువ ఓట్లు నమోదు చేసింది. ఆమెకు కేవలం 57,070ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఫలితాలతో వైసీపీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ గెలుపుతో వైసీపీకి తిరుగులేదని మరోసారి రుజువైందని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.