బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంపీ..చేరిక పక్కానే…!

-

తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది. వరుసగా ఇతర పార్టీల నేతలనీ చేర్చుకుంటూ అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే చాలామంది తెలంగాణ తెలుగుదేశం నేతలు కట్టగట్టుకుని తమ పార్టీలో చేరేలా చేసింది. అలాగే కొందరు కాంగ్రెస్ నేతలు కూడా కాషాయ కండువా కప్పుకునేలా చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ అధికార టీఆర్ఎస్ ని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు మొదలుపెట్టింది. ఆ పార్టీలో ఉన్న అసంతృప్త నేతలనీ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నం చేస్తోంది.


ఈ నేపథ్యంలో చాలాకాలంగా టీఆర్ఎస్ తో అంటిముట్టనట్లుగా ఉన్న సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ డి. శ్రీనివాస్ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరడం ఖాయమేనని అంటున్నారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ కవితతో సహ నిజామాబాద్ టీఆర్ఎస్ నాయకులు డి. శ్రీనివాస్ ని సస్పెండ్ చేయాలని అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ కి ఫిర్యాదు కూడా చేశారు.

అయితే తానేమీ పార్టీకి వ్యతిరేకంగా చేయలేదని పార్టీ నుండి వెళ్లనని డిఎస్ మొండికేసి కూర్చున్నారు. అటు కేసీఆర్ కూడా డిఎస్ ని సస్పెండ్ చేయకుండా ఉన్నారు. అయితే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లో కవితని డిఎస్ తనయుడు అరవింద్ బీజేపీ తరుపున పోటీ చేసి ఓడించాడు. ఆ ఎన్నికల్లో కుమారుడుకి సహకరించి కవిత ఓటమికి కారణమయ్యారని టీఆర్ఎస్ అధిష్టానం డిఎస్ ని పక్కనబెట్టేసింది. ఇక డిఎస్ కూడా టీఆర్ఎస్ లోనే ఉంటూ సైలెంట్ గానే ఉండిపోయారు.

ఈ తరుణంలోనే రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ కమలం పేరుతో దూసుకెళుతుంది. అందులో భాగంగా డిఎస్ త్వరలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే విషయాన్ని డిఎస్ తనయుడు బీజేపీ ఎంపీ అరవింద్ పరోక్షంగా ధృవీకరించారు కూడా. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపర్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు చూస్తుంటే డిఎస్ టీఆర్ఎస్ ని వీడి బీజేపీలోకి వెళ్ళడం పక్కా అని అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news