తెలంగాణలో ప్రతిపక్షాలని ఎక్కడకక్కడే ఎదగనివ్వకుండా అధికార టీఆర్ఎస్ బాగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ ఏడున్నర ఏళ్ల కాలంలో ప్రతిపక్షాలకు స్కోప్ లేకుండా చేసింది. రాజకీయంగా ప్రతిపక్షాలకు చెక్ పెట్టుకుంటూ వచ్చేసింది. దీంతో తెలంగాణలో ప్రతిపక్షాల ఉనికికే ప్రమాదం వచ్చింది. కానీ టీఆర్ఎస్‌గా ధీటుగా ఎప్పుడైతే బీజేపీ పుంజుకుండటం మొదలైందో అప్పటినుంచి రాజకీయం ఊహించని విధంగా మారింది. అటు కాంగ్రెస్ సైతం తన దూకుడుని మొదలుపెట్టింది. దీంతో టీఆర్ఎస్‌కి ఉక్కిరిబిక్కిరి అయిపోయే పరిస్తితి.
పైగా ఈటల రాజేందర్ లాంటి నాయకుడు టీఆర్ఎస్‌ని వదిలి బీజేపీలో చేరి ఉపఎన్నికలో గెలవడంతో..టీఆర్ఎస్‌కు అసలు తలనొప్పి మొదలైంది. అక్కడ నుంచే బీజేపీ దూకుడు మరింత పెరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరింతగా కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. ప్రజా సమస్యలపై దాడి పెంచారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య వార్ నడుస్తోంది.
ఇదే క్రమంలో బీజీపే దూకుడుని మొదట్లోనే కట్టడి చేయాలని గులాబీ దళం వ్యూహం రచించుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే తాజాగా నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన బండి సంజయ్‌ని టీఆర్ఎస్ శ్రేణులు టార్గెట్ చేశాయి. మామూలుగా అయితే బండి సంజయ్ రైతులతో మాట్లాడి వెళ్ళిపోయే వారు..కానీ అక్కడకు టీఆర్ఎస్ శ్రేణులు వచ్చి దాడులు చేయడంతో సీన్ రివర్స్ అయింది. రైతుల ముసుగులో టీఆర్ఎస్ శ్రేణులు..బండి, బీజేపీ శ్రేణులపై రాళ్ళతో దాడి చేశారు.
అంటే ఇలా చేయడం వల్ల రైతులు, బీజేపీపై కోపంతో ఉన్నారనే కోణాన్ని టీఆర్ఎస్ చూపించాలని అనుకుంది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. టీఆర్ఎస్ ఏదో ఒక ప్రతిపక్షం మాదిరిగా భయపడి బండిని ఆపాలని చూసింది. దాని వల్ల బండి హైలైట్ అవుతారు తప్ప, టీఆర్ఎస్‌కు ఒరిగేది ఏమి లేదు. కాబట్టి టీఆర్ఎస్ స్ట్రాటజీలు పూర్తిగా రివర్స్ అయ్యి బీజేపీకి బాగా కలిసొస్తున్నాయనే చెప్పొచ్చు.