మునుగోడు కారులో ట్విస్టులు.. నిలబడేది ఎవరు?

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగే ఈ ఉపఎన్నికలో గెలుపుని అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని చూస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నిక చావో రేవో అన్నట్లు వచ్చాయి. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ చేతులో టీఆర్ఎస్ చావుదెబ్బతింది.

ఇప్పుడు మునుగోడులో కూడా ఓడిపోతే..ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడి…అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఓడిపోయే పరిస్తితి వస్తుంది. అందుకే ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ చూస్తుంది. ఇప్పటికే మునుగోడుపై కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. అలాగే మునుగోడులో పార్టీ బలబలాలపై సర్వేలు కూడా చేయిస్తున్నారు. అయితే అభ్యర్ధి విషయంలో కారు పార్టీలో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఎవరిని నిలబెడితే బెటర్ అనే అంశంపై టీఆర్ఎస్ లో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి.

రెడ్డి వర్గం నాయకులు కంటే….బీసీ వర్గానికి చెందిన నాయకుడే సీటు ఇస్తే బెటర్ అని టీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కర్నే ప్రభాకర్ ల మధ్యే పోటీ ఎక్కువ ఉంది. ఒకరు రెడ్డి వర్గం నేత కాగా, మరొకరు బీసీ నేత. మునుగోడులో బీసీల ఓట్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ వైపే ఎక్కువ మొగ్గు ఉందని సమాచారం.

అదే సమయంలో ప్రభకార్ రెడ్డికి సీటు ఇవ్వొద్దని, సొంత పార్టీ వాళ్లే కేటీఆర్ కు విన్నవిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా పరిశీలనే చేయవద్దని మునుగోడు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభకార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం సొంత పార్టీ ప్రజాప్రతినిధుల ఆర్థిక మూలాలన్నింటినీ దెబ్బతీశారని, తన మాట వినని వారిపై పోలీసులు కేసులు పెట్టారని, ఆయనకు గాని సీటు ఇస్తే…టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ లేదా కాంగ్రెస్ ల్లోకి వెళ్లిపోతాయని కేటీఆర్ కు వివరించారు. దీంతో ప్రభకార్ రెడ్డికి సీటు దక్కడం డౌటే అని చెప్పొచ్చు. ఇక బీసీ వర్గంలో ఇంకా పలువురు సీటు కోసం పోటీ పడుతున్నారు. మరి చివరికి మునుగోడులో కారు సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.