కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతూ.. దేశాన్ని ముక్కలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నాయని ఆరోపించారు. కాగ ఈ మధ్య కాలంలో అనారోగ్యం పాలు అయిన ఆర్జేడీ నేత శరద్ యాదవ్ ను రాహుల్ గాంధీ ఈ రోజు పరామర్శించారు. ఢిల్లీలో శరద్ యాదవ్ ను కలిసిన తర్వాత.. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలను ఒకే తాటి పైకి తీసుకువస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితి ఉందని అన్నారు. భారత్ లో కూడా శ్రీలంక పరిస్థితులే ఉన్నాయని అన్నారు. కానీ గత రెండు ఏళ్ల నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో పాటు కొన్ని మీడియా సంస్థలు నిజాన్ని దాచాయని ఆరోపించారు. ఆ నిజం త్వరలోనే బయటకు వస్తుందని అన్నారు. అప్పుడు బీజేపీని ప్రజలు వ్యతిరేకిస్తారని తెలిపారు.