ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్..10 డివిజన్లలో ఎవరి సత్తా ఎంతంటే

-

గ్రేటర్‌లో మరో కీలక నియోజకవర్గం ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ . కొత్తగా విస్తరిస్తున్న నగరానికి కేరాఫ్ అడ్రస్. రియల్ ఎస్టేట్‌ వ్యాపారానికి పెట్టింది పేరు. ఒకప్పుడు శివారుగా ఉన్న ఉప్పల్ నియోజకవర్గం ఇప్పుడు… నగరంలో కీలక ప్రాంతం. మరి ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని డివిజన్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ సమీకరణాలెలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు అభివృద్ధంతా అటువైపే. వరంగల్ హైవేను ఆనుకొని ఉన్న ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్‌…రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అనేక పేరున్న సంస్థలు ఇక్కడ నెల‌కొల్పడంతో వాటి చుట్టూ నగరం విస్తరిస్తోంది. ఒక‌ప్పుడు శివారు ప్రాంతంగా ఉన్న ఉప్పల్ ఇప్పుడు.. న‌గ‌రానికి ప్రధాన ద్వారం అయ్యింది. ఉప్పల్‌ నియోజకవర్గ పరిధిలో 10 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడి నుంచే నగరంలో డివిజన్లు మొదలవుతాయి. గ్రేటర్‌లో మొదటి డివిజన్ కాప్రా.. ఆ తర్వాత ఏఎస్‌రావు నగర్, చర్లపల్లి, మీర్‌పేట్‌ హెచ్ బీ కాలనీ, మల్లాపూర్, నాచారం, చిలుకానగర్, హబ్సీగూడ, రామంతపూర్, ఉప్పల్.. డివిజన్లు ఉన్నాయి.

గత ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఒక నాచారం మినహా తొమ్మిది డివిజన్లను టిఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఆ కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా ప్రస్తుతం టిఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. టిఆర్ఎస్ కార్పొరేటర్లలో ముగ్గురు సిట్టింగులకు టిక్కెట్ నిరాకరించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్తవారికే అవకాశాలు ఇచ్చారు. పాతకొత్తల కలయికగా ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటుంది. ఇక కొన్ని ప్రాంతాలు ఎన్నో ఏళ్లనుంచి ఉన్నవి కాగా మరికొన్ని కొన్నేళ్లలో ఏర్పడ్డాయి. ఒక‌ప్పుడు న‌గ‌ర శివారుగా ఉండే నాచారం ఇప్పుడు న‌గ‌రంలో క‌లిసి పోయింది. డివిజ‌న్లోఅనేక మార్పులు జరిగాయి.

ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో.. సమస్యల చిట్టా కూడా పెద్దదిగానే ఉంది. డ్రైనేజీ వ్యవ‌స్ధ స‌క్రమంగా లేక‌పోవ‌డం, మంచినీటి స‌మ‌స్య, అధ్వాన్నమైన రోడ్లు, పారిశుద్ధ్యలోపం ప్రధాన సమస్యలు గా ఉన్నాయి. నాసిర‌కంగా పైపులైన్లు, విప‌రీత‌మైన ట్రాఫిక్‌, శిధిలావ‌స్థలో ఉన్న భ‌వ‌నాలు, ఉప్పల్ భ‌గాయ‌త్ ప్లాట్ల పంపిణీతో పాటు మ‌రికొన్ని స‌మ‌స్యలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లోని డివిజన్లలో కార్పొరేటర్ల వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్లు క‌న‌ప‌డుతుంది. అస‌లు కార్పోరేట‌ర్ ఎవ‌రో కూడా డివిజ‌న్లోని ప్రజ‌లకు తెలియ‌దంటే ప‌రిస్దితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. డివిజన్లలో మహిళా కార్పొరేటర్ల స్థానంలో వారి భర్తల పెత్తనమేఎక్కువ.

మున్సిపల్‌ పరిధిలో రోడ్లు, అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా అధికారులు చర్చించి వదిలేయడమే తప్ప రోడ్ల సమస్యను పరిష్కరించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ సెగ్మెంట్ గుండా రింగు రోడ్డు ఉండటం, వరంగల్‌ జాతీయ రహదారి వెళ్లడంతో ఉప్పల్‌లో ట్రాఫిక్‌ జామ్‌ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఉప్పల్‌ రింగురోడ్డు నుంచి నల్ల చెరువు వరకూ రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌జామ్‌, ఇరుకు రోడ్లను చూసి ఇంటినుంచి బయటకు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి ఉంది. ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించేందుకు చేసిన ప్రయత్నాలను ఇక్కడి రాజకీయపెద్దలు, వ్యాపారులు కలిసి అడ్డుకున్నారు.

ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో .. పది డివిజన్లలోని పేదలు డబుల్ బెడ్రూమ్‌ల గురించి ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు నిర్మించిన ఇళ్ల కేటాయింపుల పై స్పష్టత లేదు. దీంతో లబ్ధిదారులు వేచిచూస్తున్నారు. ఇక మేయర్ డివిజన్ చర్లపల్లిలో ఇప్పటికీ మంచినీటి సమస్య ఉంది. నగర మేయర్ తన సొంత డివిజన్‌లో మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించారు. మొత్తానికి పది డివిజన్లతో ఉన్న… ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ గతానికి భిన్నంగా ఈసారి గ్రేటర్ రాజకీయం నడుస్తోంది. ప్రధానంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ జరుగుతోంది. మరి గత ఎన్నికల్లో మాదిరిగా… ఉప్పల్‌పై గులాబీ సత్తా చాటుతుందా లేదో అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news