ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై పోటీకి కేంద్రమంత్రిని రంగంలోకి దింపింది బీజేపీ. మైన్ పురిలోని కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ స్థానం నుంచే కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్ ను పోటీలో నిలిపింది బీజేపీ. ప్రస్తుతం బఘేల్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు.
సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నామినేషన్ వేసిన నిమిషాల వ్యవధిలోనే కేంద్రమంత్రి బఘేట్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన బఘేల్.. యూపీ క్యాబినెట్ లో పశుసంవర్ధక, మత్స్య మరియు చిన్న నీటిపారుదల శాఖలను కూడా నిర్వహించారు. మొత్తం యూపీలో 7 దశల్లో ఎన్నికలు జరుగనుండగా.. మూడో విడతలో కర్హల్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగనున్నాయి.