తెలంగాణ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి డబ్బులు తెచ్చి పంచుతున్నారని గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే.కేటీఆరే కాకుండా పలువురు బీజేపీ నేతలు కూడా ఇదే ఆరోపణలు చేశారు. కర్ణాటకలో వాల్మీకి స్కామ్ అక్కడి రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.ప్రస్తుత సిద్ధరామయ్య సర్కార్ వరుస స్కాముల్లో కూరుకుపోయింది. ఓవైపు వాల్మీకి, మరోవైపు ముడా స్కామ్స్ కర్ణాటక కాంగ్రెస్ సర్కారును ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ అక్కమార్కుల భరతం పట్టే పనిలో నిమగ్నమైంది.
ఈ క్రమంలోనే తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాల్మీకి స్కాం గురించి తాజాగా స్పందించారు. వాల్మీకి కుంభకోణంలో కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘మేమన్నదే నిజమైంది’ ఈ స్కామ్ ద్వారా రూ.187 కోట్ల నిధులు దారిమళ్లాయి. ఆ సొమ్మును తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కోసం ఉపయోగించారు. ఈ కేసులో నిందితుడు సత్యనారాయణ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్. ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అత్యంత సన్నిహితుడు’ అని రాసుకొచ్చారు.