రాజకీయాల్లో అతికీలకమైన అంశాల్లో ఒకటి… ప్రజారంజకమైన ఆలోచన చేయడం.. వీలైనంత తొందరగా దాన్ని అమలు చేయడం! అని అంటుంటారు సీనియర్ రాజకీయ పండితులు. ఎందుకంటే… ఇక్కడ సరైన సమయంలో సరైన ఆలోచన రావడం.. దాన్ని ఆచరణలో పెట్టడమే కీలకం. ఈ సమయంలో తన రాజకీయ ప్రత్యర్ధి అయిన నారా లోకేశ్ కు విలువైన సలహా చేశారు విజయసాయి రెడ్డి. గత కొన్ని రోజులుగా కాస్త ట్విట్టర్ లో స్వరం పెంచిన లోకేశ్ కు చురకలు వేస్తున్న క్రమంలో విలువైన సూచన చేశారు సాయి రెడ్డి.
అవును… టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మాజీ మంత్రి లోకేశ్ కు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి చురకలు అంటిస్తూనే విలువైన సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించిన సాయిరెడ్డి… “ఈ వయసులో చంద్రబాబు రాకున్నా.. కనీసం లోకేశ్ నాయుడైనా తమ పార్టీ తరపున సేవా కార్యక్రమాలు చేపట్టాలి. మంత్రిగా పదవి అనుభవించిన వ్యక్తి ఇంట్లో కూర్చుని ట్విట్టర్లో ఆవేశపడితే ఎలా? కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరిన వారితో మాట్లాడాలి. తండ్రి చాటున దాక్కుని రాళ్లు విసరడం కాదు” అన్నారు. ఇందులో సాయిరెడ్డి తెలిసి చేశారో తెలియక చేశారో కానీ… విలువైన సలహా ఇచ్చారనే చెప్పాలి.
నిజంగా ఇప్పటికైనా ఆ ఇళ్లు వదిలి.. లోకేశ్ బయటకు వచ్చి.. 70ఏళ్ల వయసులో ఇంక తన తండ్రిని కష్టపెట్టకుండా, తానే స్వయంగా… కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరిన వారిని పరామర్శిస్తే.. రాజకీయంగా మంచి మైలేజీ వస్తుందని అంటున్నారు విశ్లేషకులు. మరి లోకేష్ ఆ దిశగా ఆలోచిస్తారా లేక.. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి… మే నెల అంతా వేసవి సెలవుల్లోనే గడిపేస్తారా అనేది వేచి చూడాలి.
ఇదే సమయంలో మరో ట్వీట్ చేసిన విజయసాయి… “టీడీపీ, దాని బానిసలకు లాక్ డౌన్ తో మతి భ్రమించినట్టుంది. కరోనా కిట్ల ధరలపై అరిచి భంగపడ్డారు. కిట్ల తయారీ కంపెనీలో వాటాలున్నాయని, డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకున్నారని మంటలు రాజేస్తున్నారు. రివర్స్ టెండర్లతో 2 వేల కోట్ల ప్రజాధనం ఆదాచేసిన సిఎం ఉన్నారిక్కడ. నోరు పారేసుకోవద్దు.” అంటూ జగన్ క్రెడిబిలిటీ గురించి ఒక్క మాటలో చెప్పి పూర్తిచేశారు!