విజయసాయిరెడ్డి..వైసీపీలో ఈయన పాత్ర ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్‌కు కుడి భుజం లాంటి నేత..అయితే ఇవన్నీ ఒకప్పుడు ..ఇప్పుడు ఆయన పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. రాజకీయాల జోలికి రావడం లేదు ప్రత్యర్ధులపై విమర్శలు చేయడం లేదు. దీంతో ఇంకా వైసీపీలో విజయసాయిరెడ్డి యాక్టివ్ కావడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడుప్పుడే ఆయన యాక్టివ్ అవుతున్నారు. అదే సమయంలో జగన్..ఆయనకు కీలక పదవి అప్పగిస్తున్నారు. దీంతో ఇంకా విజయసాయి దూకుడు గా పనిచేస్తారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
అయితే విజయసాయి పనితీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏ మాత్రం పట్టు లేని ఉత్తరాంధ్రని వైసీపీ కంచుకోటగా మార్చారు. 2014లో విజయమ్మ విశాఖ బరిలో ఓడిన దగ్గర నుంచి అక్కడే సెటిల్ అయ్యి విజయసాయి పనిచేయడం మొదలుపెట్టారు. మళ్ళీ అక్కడ వైసీపీ విజయ ఢంకా మోగించే వరకు నిద్రపోలేదు. టిడిపిపై పోరాడుతూనే..ఎప్పటికప్పుడు ప్రత్యర్ధులపై విరుచుకుపడుతూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ వన్ సైడ్ గా గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇక అధికారంలోకి వచ్చాక చాలా రోజులు దూకుడుగానే ఉన్నారు.
సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుని ఎలా టార్గెట్ చేసేవారో తెలిసిందే. ఆయనపై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. కానీ నిదానంగా వైసీపీలో సాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గింది. ఆయన నిర్వహించే ఉత్తరాంధ్ర బాధ్యతలని వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు. సోషల్ మీడియా బాధ్యతలని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడుకు ఇచ్చారు. పైగా నందమూరి తారకరత్న చనిపోయిన సమయంలో చంద్రబాబు, సాయిరెడ్డి కలిశారు. వీరిద్దరు తారకరత్నకు మావయ్య వరుస అవుతారు.
ఆ తర్వాత నుంచి సాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బాబుపై విమర్శలు చేయడం లేదు. కానీ తాజాగా చంద్రబాబు మేనిఫెస్టోపై విమర్శలు చేశారు. అదే సమయంలో ఇటీవల బాలినేని శ్రీనివాస్ రెడ్డి..ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ప్రాంతీయ సమన్వయకర్త పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
సుబ్బారెడ్డితో ఉన్న విభేదాల నేపథ్యంలో పదవి నుంచి తప్పుకున్నారు. జగన్ బుజ్జగించిన బాలినేని తగ్గలేదు. దీంతో ఆ పదవిని సాయిరెడ్డికి ఇస్తున్నారు. సాయిరెడ్డి కూడా ఒప్పుకోలేదు..కానీ జగన్ మాట్లాడటంతో ఆ పదవి తీసుకుంటున్నారని తెలుస్తుంది. దీంతో సాయిరెడ్డి..ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతలు తీసుకుని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పార్టీకి కొత్త ఊపు తీసుకురానున్నారు.