ఆత్మకూరులో లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలి అని యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు సంబంధిత శ్రేణులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కానీ ఇవాళ వచ్చిన రిజల్ట్ మాత్రం ఆ విధంగా లేదు. ఇక్కడ అనివార్యం అయిన ఉప ఎన్నికల ఫలితాల్లో మేకపాటి విక్రం రెడ్డి 82,888 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని స్థానిక మీడియా అందిస్తున్న సమాచారం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ కి 19,316 ఓట్లు వచ్చాయని చెబుతోంది.
ఇక ఈ విషయమై చర్చోపచర్చలు అన్నవి అప్పుడే సోషల్ మీడియాలో మొదలయ్యాయి. సంక్షేమమే ప్రథమావధి, పరమావధి అని భావిస్తున్నవైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుటికైనా పునరాలోచన చేసుకోవాలని సంబంధిత పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కేవలం సంక్షేమంపైనే నమ్మకాలను పెట్టుకుని తరువాత పరువు పోగొట్టుకునే కన్నా, వీలున్నంత మేర అభివృద్ధికీ నిధులు ఇవ్వాలని కోరుతున్నారు వీరు.
మరోవైపు టీడీపీ కూడా ఇదే విషయమై కొంచెం విభిన్నంగానే ఉంటోంది. ఆత్మకూరులో తాము పోటీ చేయలేదని కానీ బీజేపీ మాత్రం అభ్య ర్థిని నిలబెట్టిందని, అయినప్పటికీ అధికార పార్టీ ఇక్కడ రిగ్గింగ్ చేసింది అని ఆరోపిస్తోంది. నెల్లూరు కేంద్రంగా జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులు రోజా రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి కొడాలి నాని, మరో మంత్రి పెద్ది రెడ్డి ఇలాంటి పెద్దలంతా
మోహరించినా కూడా అనుకున్న మెజార్టీ దక్కకపోవడంతో విపక్షం నుంచి కూడా సెటైర్లు వస్తున్నాయి. కొన్ని సార్లు అతి విశ్వాసం కూడా ప్రమాదకరం.. ఆ తరహా విశ్వాసాలు కొంపలు ముంచుతాయి అని కూడా అంటున్నాయి.