‘ పొంగులేటి ‘ ని టెన్ష‌న్ పెడుతోందెవ‌రు.. కుడితిలో ప‌డిన ఎలుక అయ్యాడే…!

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని అందరూ భావించారు. అది సాధ్యం కాలేదు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ కూడా క‌మ్యూనిస్టుల‌ను పొత్తుల పేరుతో పిలిచి అవ‌మానించేలా వ్య‌వ‌హ‌రించింది. సీపీఎంతో పొత్తు లేద‌ని క‌టిఫ్ చెప్పేసింది. సిపిఐ కి మాత్రం కొత్తగూడెం సీటుతో సరిపెట్టింది.

కాంగ్రెస్ కూడా పొత్తుకు ఒప్పుకోకపోవడంతో సిపిఎం కొన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తుంది. అయితే సిపిఎం పోటీ కొన్ని నియోజకవర్గాల్లో పరోక్షంగా కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ టాప్‌ లీడర్లు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఖమ్మంలో పాలేరు, నల్గొండలో మిర్యాలగూడ సెగ్మెంట్లలో సిపిఎం చీల్చే ఓట్లు కాంగ్రెస్ గెలుపు ఓటములను నిర్దేశించ‌నున్నాయి.

పాలేరు నియోజకవర్గంలో ముందు నుంచి కమ్యూనిస్టులకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ నుంచి ఆ పార్టీ నేతలు గతంలో చాలా సార్లు పోటీ చేయడంతో పాటు కొన్నిసార్లు అసెంబ్లీకి కూడా ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా ఖమ్మం రూరల్ మండలంలో సిపిఎం, సిపిఐకి ఒక మోస్తరు ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు సిపిఎం నుంచి ఆ పార్టీ రాష్ట్ర స్థాయినేత తమ్మినేని వీరభద్రం పోటీలో ఉండడంతో రూరల్ మండలంతో పాటు నియోజకవర్గంలో ఉన్న సిపిఎం ఓటు బ్యాంకు ఆయన చీల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

త‌మ్మినేని 6-8 వేల ఓట్ల నుంచి పైన ఎంత చీలిస్తే పొంగులేటి గెలుపు అంత డేంజ‌ర్‌లోకి వెళ్లిపోతుంద‌ని వాళ్ల పార్టీలోనే ప‌లు విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు సీపీఎంతో పొత్తు ఉంటుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న పొంగులేటికి ఇప్పుడు తాజాగా మారిన రాజ‌కీయంతో గొంతులో ప‌చ్చివెల‌క్కాయ ప‌డిన‌ట్లుగా అయ్యింది. దీనికి తోడు కాంగ్రెస్ త‌మ‌ను ఘోరంగా అవ‌మానించింద‌ని త‌మ్మినేని వీర‌భ‌ద్రం ఘాటైన వ్యాఖ్య‌ల‌తో రెచ్చిపోతున్నారు.

ఎలాగైనా రాష్ట్ర స్థాయి నేత‌గా తాను పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంలో భారీగా ఓట్లు సాధించి స‌త్తా చాటాల‌ని చూస్తున్నారు. ఆయ‌న ఈ విష‌యంలో గ‌ట్టి పంతంలోనే క‌నిపిస్తున్నారు. త‌మ్మినేని 6- 8 వేల పైచిలుకు ఓట్లు వ‌స్తే ఇప్పుడున్న టైట్ పొజిష‌న్‌లో పొంగులేటి ఓట్ల‌కు భారీగా గండిప‌డ‌నుంది. ఏదేమైనా పాలేరులో పొంగులేటి కుడితిలో ప‌డిన ఎలుక‌లా కొట్టుకుంటోన్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news