బెజ‌వాడ రౌడీలెవ‌రు?

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌టానికి ఇంకా ఒక్క‌రోజే స‌మ‌యం ఉంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ ఫ‌లితాల‌పైనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అంద‌రి దృష్టి విజ‌య‌వాడ‌పైనే ఉంది. రాజ‌ధాని పరిధిలో ఉన్న ఈన‌గ‌రంపై అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి ధీమాను వ్య‌క్త‌ప‌ర‌చ‌లేక‌పోతోంది. ఇక్క‌డ జ‌రిగిన పోలింగ్ స‌ర‌ళి చూస్తే టీడీపీ, వైసీపీ మ‌ధ్య‌ ఢీ అంటే ఢీ అనేరీతిలో పోరు జ‌రిగిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఏక‌ప‌క్షంగా ఫ‌లితాలొస్తాయ‌నే ధీమాతో ఉన్న వైసీపీకి తెలుగుదేశం పార్టీ ఎక్స్ అఫిషియో ఓట్లు క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్నాయి.

ఎక్స్ అఫిషియో కీల‌కం

విజయవాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లో మొత్తం 64 డివిజన్లు ఉన్నాయి. వైసీపీ అన్ని డివిజన్లలో పోటీ చేయగా.. టీడీపీ 56 స్థానాల్లోనే త‌న అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టింది. ఏడు డివిజన్లను మిత్ర‌ప‌క్షం సీపీఐకి కేటాయించి, ఒక డివిజన్లో జనసేనకు మద్దతిచ్చింది. ఆ పార్టీ త‌మ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత పేరును ప్రకటించగా, వైసీపీ మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. మేయ‌ర్ అభ్య‌ర్థిత్వం కోసం పోటీ ఎక్కువ‌గా ఉండ‌టంతో ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత చూద్దామ‌నే ధోర‌ణిలో ఆ పార్టీ నేత‌లున్నారు. 40 నుంచి 50 సీట్ల మ‌ధ్య‌లో గెలుస్తామ‌నే అంచ‌నాలు ఆ పార్టీకున్నాయి. 35 నుంచి 40 స్థానాల్లో విజయం తమదేనని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఫలితాల సంగతి ఎలా ఉన్నా పోరు మాత్రం హోరాహోరీగా ఉండే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ఒక‌వేళ ఇరుపార్టీల‌కు స‌మానంగా సీట్లు వ‌స్తే ఎక్స్అఫిషియో ఓట్లు కీల‌క‌పాత్ర పోషించ‌బోతున్నాయి.

30 వ‌స్తే చాలు

విజయవాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లో ఎక్స్ అఫిషియో ఓట్లు టీడీపీకే ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేషన్లో 64 డివిజన్లుండగా.. ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు నగరంలోనే ఉన్నారు. వీరు కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు విజయవాడకు చెందినవారున్నారు. మరో ఎమ్మెల్సీకి కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చే అవకాశముండటంతో మొత్తం ఓట్ల సంఖ్య 71కి చేరింది. దీంతో 36 ఓట్లు వచ్చిన పార్టీకి మేయర్ పీఠం దక్కుతుంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, పరుచూరి అశోక్‌బాబు, బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా టీడీపీకి చెందిన వారే కావడంతో వారి ఓట్లన్నీ ఆ పార్టీకే పడతాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ 36ను చేరుకోవాలంటే.. టీడీపీ 30 సీట్లను కైవ‌సం చేసుకుంటే స‌రిపోతుంది.

34 కావాలి

వైసీపీకి మాత్రం కేవలం ఇద్దరు ఎక్స్ అఫిషియో ఓట్లర్లే ఉన్నారు. విజయవాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే, మంత్రి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వీరిద్ద‌రే ఆ పార్టీకున్నారు. వైసీపీకి మ్యాజిక్ ఫిగర్ రావాలంటే కనీసం 34 డివిజ‌న్లు కైవ‌సం చేసుకోవాలి. మ్యాజిక్ ఫిగర్ ను టీడీపీ, వైసీపీ చేరుకుంటాయా? లేదా? అనేది ఈ నెల 14న తేల‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news