హరీశ్‌రావుక సిద్దిపేటలో ఎంత పట్టుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు పోటీ వచ్చే వారే ఆ నియోజకవర్గంలో లేరు. 2018లో ఆయనపై పోటీ చేసేందుకే ప్రతిపక్షాలకు నాయకులు దొరకలేదంటే.. ఆయన హవా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో ఆయన చెప్పిందే వేదం. ఆయన నిలబెట్టిన వ్యక్తే గెలుస్తాడు. ఇదంతా మొన్నటి దుబ్బాక ఎలక్షన్లకు ముందు మాట. కానీ ఇప్పుడు సీన్ కాస్త మారింది. రఘునందన్ రావు గెలుపుతో హరీశ్ రావు ఓడిపోయారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ హరీవ్ రావు తనను తాను నిరూపించుకునే టైమ్ వచ్చింది.
సిద్దిపేటలో తనకు ఎదురు లేదని ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి మళ్లీ తన చరిష్మాను కాపాడుకోవాలని పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కేవలం బీజేపీ వాళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ సవాల్ విసురుతున్నారు. నిన్న ఆయన ఓ ప్రచార సభలో మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లు బీడీ కార్మికుల పొట్ట కొట్టారని విమర్శించారు. జీఎస్టీ పెట్టి బీడీలు చేసుకునే వారిపై భారం మోపారని మండిపడ్డారు. బీడీ కార్మికులకు తామే పెన్షన్ ఇస్తున్నామని.. బీజేపీ వాళ్లు ఇస్తే ముక్కు నేలకు రాస్తానంటూ ఇన్‌డైరెక్ట్ గా రఘునందన్ రావుకు సవాల్ విసిరారు.
దుబ్బాకలో గెలిచిన రోజే.. తాను సిద్దిపేటలో బీజేపీ జెండా ఎగరేస్తానని సవాల్ విసిరారు రఘునందన్‌రావు. ఎలాగైనా ఈ మున్సిపల్ ఎన్నికల్లో తన మార్కును చూపించాలని తెగ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటల వేడి రాజుకుంటోంది. హరీశ్ రావును రఘునందన్ రావు డైరెక్ట్‌గానే టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. దమ్ముంటే చర్చలకు ముందుకు రావాలంటూ సిద్దిపేట అభివృద్ధి కేంద్రంగా ఆయన కూడా సవాళ్లు విసురుతున్నారు. అయితే అధికారం రాకపోయినా.. కనీసం ఎక్కువ సీట్లు గెలుచుకొని తన హవాను చూపించాలనుకుంటున్నారు రఘునందన్ రావు. ప్రచారం నేటితో ముగియడంతో.. ఇద్దరు పోల్ మేనేజ్‌మెంట్‌పై గురి పెడుతున్నారు. చూడాలి మరి ఎవరు పై చేయి సాధిస్తారో.