నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది.ఓ గ్రామం పేరు నియోజకవర్గానికి పెట్టడం ఇక్కడొక విశేషం. వెంకటాచలం మండలంలోని చిన్నగ్రామం సర్వేపల్లి.1955 నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నా ఇప్పటికీ అదే పేరుతో కొనసాగుతోంది.ఈ నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. వెంకటాచలంతోపాటు పొదలకూరు,మనుబోలు,ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాలు ఇందులో ఉన్నాయి.ఒక ఉప ఎన్నిక సహా 15 సార్లు ఇక్కడ ఎన్నికలు జరుగ్గా ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.నాలుగుసార్లు తెలుగుదేశం పార్టీ,రెండుసార్లు వైసీపీ,ఒక్కసారి సీపీఐ అభ్యర్ధులను ఇక్కడ ఓటర్లు ఎన్నుకున్నారు.ఈ నియోజకవర్గంలో 2,29,139 మంది మొత్తం ఓటర్లు ఉండగా 1,11,496 మంది పురుషులు-1,17,613 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మూడోసారి వైసీపీ అభ్యర్ధిగా మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి అభ్యర్ధిగా రంగంలోకి దిగుతున్నారు.వరుసగా రెండుసార్లు గెలిచిన గోవర్ధన్‌రెడ్డి ఈసారి హ్యాట్రిక్ కోట్టాలన్న ఆలోచనలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు.ఇక్కడ రెండుసార్లకు మించి ఇప్పటివరకు ఎవరూ గెలిచిన దాఖలాలు లేవు.గతంలో సివి శేషా రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిల్లో ఎవరు గెలిచినా అదోక రికార్డే అవుతుంది. టీడీపీ నుంచి సోమిరెడ్డికి సీటు దక్కడం ఈసారి కష్టంగా కనిపిస్తోంది.
ఇక ఇప్పవరకు ఇక్కడ జరిగిన ఎన్నికలను ఓసారి పరిశీలిస్తే 1955 జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బెజవాడ గోపాలరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.1956లో ఉప ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వంగల్లు కొదండరామిరెడ్డి గెలిచారు. 1962లో స్వతంత్ర అభ్యర్ధి వేమారెడ్డి వెంకురెడ్డి,1967లో సీపీఐ అభ్యర్ధి స్వర్ణా వేమయ్య,1972లో కాంగ్రెస్ అభ్యర్ధి మంగళగిరి నానాదాస్,1978లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చిత్తూరు వెంకటశేషారెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 1983లో టీడీపీ తరపున బరిలో నిలిచిన చెన్నారెడ్డి పెంచలరెడ్డి,1985లో టీడీపీ నేత ఈదూరు రామకృష్ణారెడ్డి,1989 కాంగ్రెస్ పార్టీ నుంచి చిత్తూరు వెంకటశేషారెడ్డి విజయం సాధించారు.1994,1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచారు.2004,2009లో కాంగ్రెస్ అభ్యర్ధి ఆదాల ప్రభాకర్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన కాకాని గోవర్ధన్‌రెడ్డి గెలిచి ఎమ్మెల్యేగా చట్టసభల్లో అడుగుపెట్టారు.