యూపీ ప్ర‌చారానికి కేసీఆర్ ఎందుకు వెళ్ల‌లేదంటే?

-

కొన్ని సార్లు మౌనం చేదు కాదు తీపి
తీపి ఫ‌లితాలు అందించ‌కున్నా
చేదును మాత్రం మిగల్చ‌కుండా ఉంటుంది
అటువంటి ప‌రిణామ‌మే నిన్న‌టి వేళ
కేసీఆర్ కు ద‌క్కింది. ఎదురు చూసిన ఫ‌లితాలు
మోడీకి అనుకూలంగా ఉన్నాయి
యోగి స్థాయిని చాటింపు వేసేలా ఉన్నాయి
క‌నుక కేసీఆర్ అనే పెద్ద ఆత్రం ఉన్న మ‌నిషి
యూపీకి పోకుండా త‌న‌ని తాను ఇంటికి ప‌రిమితం చేసుకోవ‌డంలోనే
సిస‌లు విజ‌యం దాగి ఉంది. ఓ విధంగా ప‌రువు నిల‌బెట్టుకునే ప‌ని ఇది!
అవును! ఈ మౌనం మంచిదే.. చేద‌యినా తీపి అయినా ఏద‌యినా
జీవితాన ముఖ్యంగా ఎన్నిక‌ల ర‌ణ క్షేత్రాన భ‌రించాల్సిందే!

కేసీఆర్ ఏమన్నా అనుకున్నారంటే.. అది అయ్యేవరకు వదిలిపెట్టరు.. అసలు ఎక్కడా తగ్గేదేలే అన్నట్లే ముందుకెళ్తారు.. అనుకున్నది చేసే విషయంలో వెనక్కి తగ్గని కేసీఆర్.. ఇటీవల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు.. మొదట నుంచి యూపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తారని అంతా అనుకున్నారు…ఆయన కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్ళి.. అటు నుంచి యూపీ ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్లడానికి సిద్ధమయ్యారని మీడియా లోకం కొత్త వార్త‌ను వండి వార్చింది. వారణాసి ప్రాంతంలో ప్రచారం చేస్తారని కథనాలు వచ్చాయి. అవి ప్ర‌సార యోగ్య‌త‌కు నోచుకున్నాయి. వీటినే నిర్థారిస్తున్న విధంగా కేసీఆర్ ప్రచారానికి వస్తున్నార‌ని చాటింపు వేస్తూ సంబంధిత ధోర‌ణిని స్వాగ‌తిస్తూ వారణాసిలో బ్యానర్లు కూడా కనిపించాయి.

ఏం జరిగిందో ఏమో ? తెలియదు గాని కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. అనూహ్యంగా ఆయన ప్రచారానికి దూరమయ్యారు. ఇక ఆయన ఎన్నికల ప్రచారానికి ఎందుకు దూరమయ్యారో తాజాగా యూపీ ఫలితాలతో క్లారిటీ వచ్చింది. యూపీలో వ‌రుస‌గా రెండోసారి బీజేపీ అదిరిపోయే మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక కేసీఆర్ సపోర్ట్ చేసిన ఎస్పీ దారుణంగా ఓడిపోయి 126 స్థానాల‌కు త‌న‌ని తాను కుదించుకుని, ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది.అంటే కేసీఆర్ ముందే ఓటమిని ఊహించారా?
లేదా ప్ర‌శాంత్ కిశోర్ వ్యూహం లో భాగంగానే ఇదంతా చేశారా? అన్న సందేహాలు లేదా అనుమానాలు కూడా వెలుగులోకి వ‌స్తున్నాయి.

ఈ మధ్య కేసీఆర్,బీజేపీపై పెద్ద యుద్ధమే చేస్తున్నారు.దేశంలో బీజేపీని గద్దె దించాలని కంకణం కట్టుకుని తిరుగుతున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేసే పనిలో పడ్డారు. ఇంత‌వ‌ర‌కూ జ‌రిగింది అభివృద్ధే కాద‌ని తేల్చేస్తూ 70 ఏళ్ల కాలంలో వైఫ‌ల్యాల‌ను ఏక‌రువు పెడుతూ ఉన్నారు.దేశాన్ని అనూహ్య రీతిలో మార్చేస్తానని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం యూపీలో బీజేపీకి చెక్ పెట్టాలని అనుకున్నారు.అందుకే ఎస్పీకి మద్ద‌తు తెలిపారు.

అదేవిధంగా యూపీకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేయాలని అనుకున్నారు.కానీ ముందే కొన్ని సర్వేల అందడంతో కేసీఆర్ వెనక్కి తగ్గారని తెలుస్తోంది. బీజేపీకి గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడటంతో ప్ర‌చారం చేసినా కూడా ఫ‌లితం ఉండ‌ద‌ని, అటువంట‌ప్పుడు ఎందుకు ప్ర‌చారం చేసి క్షేత్ర స్థాయిలో ఉన్న ప‌రువు కాస్త పోగొట్టుకోవ‌డం అని భావించి కేసీఆర్ సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. ప్రచారానికి వెళితే అనవసరంగా రాజకీయ పరమైన ఇబ్బందులు వస్తాయని ముందుగానే ఊహించి కేసీఆర్ వ్యూహాత్మ‌క నిశ్శ‌బ్దాన్ని ఎంచుకోవ‌డం ఇవాళ్టి ప‌రిణామాల్లో చ‌ర్చ‌కు దారితీస్తున్న విష‌యం.

– పొలిటిక‌ల్ ఎఫైర్స్ – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news