తెలంగాణలో వారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు…? అదే బీజేపీకి బలం అయిందా…?

ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో భారతీయ జనతాపార్టీ గోతి కాడ నక్కలా కాచుకుని కూర్చుంది. టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూస్తోంది. భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా చేస్తోంది. పదేపదే చేస్తున్న విమర్శలతో టీఆర్ఎస్ నేతలు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయంగా కేసీఆర్ ను ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకునే ఆలోచనలో లేదు. ఇలాంటి సమయంలో తెలంగాణలో బలంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ బిజెపి ని ఎదుర్కొనే విషయంలో మాత్రం ఘోరంగా విఫలం అవుతుంది అనే విషయం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అసలు ఏం జరుగుతుంది…?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మీద బీజేపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బిజెపి చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి కూడా బలంగానే వెళుతున్నాయి. దానికితోడు తెలంగాణ హైకోర్టు ఇప్పటివరకు దాదాపు ఏడెనిమిది సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేసింది. ఆ విషయంలో జరుగుతున్న తప్పులను హైకోర్టు ఎండగడుతుంది. కానీ ఈ విషయంలో మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానీ ఒక్కరంటే ఒక్కరు కూడా బిజెపికి ధీటైన స్థాయిలో సమాధానం ఇవ్వటం లేదు. మాట్లాడితే హరీష్రావు మాట్లాడటం లేకపోతే ఈటెల రాజేందర్ మాట్లాడటం. అంతేగాని పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కానీ సీనియర్ మంత్రులు గానీ తమ తమ నియోజకవర్గాల్లో తమ తమ జిల్లాలో కరోనా విషయంలో తీసుకుంటున్న చర్యలను లెక్కలతో సహా వివరించే ప్రయత్నం ఒక్కశాతం కూడా చేయటం లేదు.

తెలంగాణలో కరోనా టెస్టులు జరగడం లేదని టిఆర్ఎస్ అభిమానించే వారు కూడా కొన్ని సందర్భాల్లో అంటున్నారు. అంటే కచ్చితంగా అది టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే. ఆంధ్రప్రదేశ్లో వేల కేసులు వస్తున్న సమయంలో తెలంగాణలో వందల కేసులు చెప్పారు. ఆ తర్వాత హైకోర్టు సీరియస్ కావడంతో పరీక్షల సంఖ్య పెంచడంతో కేసులు కూడా పెరుగుతూ వచ్చాయి. హైదరాబాద్లో కరోనా వైరస్ అసలు లేదని చాలా వరకు కట్టడి చేశామని తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి మంత్రులు మాట్లాడారు. కానీ హైదరాబాదులో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. దాదాపుగా ప్రతిచోటా కేసులు ఉన్నాయి. విశాఖ లాంటి నగరం లోనే భారీగా కేసులు ఉంటే హైదరాబాద్ లాంటి నగరం లో ఎన్ని కేసులు ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు చేయకుండా తక్కువగా చెప్తోంది. దీనిపై బిజెపి ప్రజల్లోకి వెళ్లే విధంగా విమర్శలు చేస్తోంది.

హైకోర్టు జోక్యం తర్వాత గతంతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణలో కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కానీ వాటిని కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా చెప్పడంలో మాత్రం బీజేపీ నేతలు ఘోరంగా విఫలమయ్యారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా పరిస్థితులు ఉంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడటం పెద్ద విషయం కాదు. ఇప్పటికైనా మంత్రులు ఎమ్మెల్యేలు కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా విమర్శలు చేస్తే… తమకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా కొన్ని ప్రసారాలు అయినా చేయిస్తే బాగుంటుంది అనే భావన వ్యక్తమవుతోంది. లేకపోతే మాత్రం తెలంగాణ పరువు జాతీయస్థాయిలో పోయే అవకాశాలు కూడా ఉంటాయి.