హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఉన్న సింగరేణి కాలనీలో ఇటీవల 6 ఏళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యంత దారుణంగా అత్యాచారం చేయడంతోపాటు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై యావత్ తెలంగాణ భగ్గుమంటోంది. వెంటనే నిందితున్ని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ నిందితుడి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు.
ఈ క్రమంలోనే నిందితుడి చిత్రాలను విడుదల చేసి పట్టిచ్చిన వారికి రూ.10 లక్షలు రివార్డు ప్రకటించారు. అయితే ఇదే సంఘటనపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము నిందితున్ని కచ్చితంగా పట్టుకుంటామని, అతన్ని ఎన్‌కౌంటర్ చేసి చంపేస్తామని తెలిపారు. బాధిత కుటుంబాన్ని సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయగా.. మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాల్సిందే. కానీ ఎన్‌కౌంటర్ చేస్తామని బహిరంగ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. గతంలో దిశ సంఘటనలోనూ నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. అయితే పోలీసులు ఇప్పుడు కూడా అలాగే చేస్తారా ? లేదా ? అన్నది సందేహంగా మారింది.