ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో ఇప్పుడు ఆధిపత్య పోరు క్రమంగా పెరుగుతుంది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న అధికార పార్టీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ పోరు పార్టీని తీవంగా ఇబ్బంది పెడుతుంది. ఒక పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా నాయకుల తీరుతో అంతిమంగా పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ స్థాయి నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుతో పార్టీని ఇబ్బంది పెడుతున్నారు.
రాజకీయంగా పార్టీ చాలా బలంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్దమవుతుంది. గుంటూరు జిల్లాలో ఈ ఆధిపత్య పోరు క్రమంగా పెరుగుతుంది. నరసరావు పేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు, చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజని ఇప్పుడు ఇబ్బందికరంగా మారారు పార్టీకి. చిన్న చిన్న వాటిని కూడా పెద్ద పెద్దగా చూస్తూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు.
వీరి మధ్య తాజాగా మరో వివాదం చోటు చేసుకుంది. ఎంపీ వర్గానికి చెందిన ఓ వ్యక్తికి బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అయితే, దానికి సంబంధించిన రేకులు అడ్డుగా ఉన్నాయంటూ చిలకలూరిపేట మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తొలగించేందుకు సిద్ధమయ్యారు. రేకులను తొలగించే వరకు అక్కడే కూర్చొన్నారు. దీంతో బార్ యజమాని బహిరంగంగానే తాను ఎంపీ వర్గమని తెలిసి, ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆరోపణలు చేయడం గమనార్హం.
అయితే తన నియోజకవర్గంలో ఎంపీ గారి పెత్తనం ఎక్కువగా ఉందని ఇది అవసరం లేదని, అవసరం అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా గాని తన మీద ఈ పెత్తనం వద్దని, ఇద్దరం ప్రజా మద్దతుతోనే పదవులు అనుభవిస్తున్నామని ఎమ్మెల్యే రజని అంటున్నారు. ఈ వివాదం క్రమంగా చినికి చినికి గాలి వానగా మారుతుంది. ఆమె రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి అనేది కొందరి మాట.