ఏపీలో లడ్డూ వివాదం.. టీడీపీ వందరోజుల పాలన వ్యవహారం నడుస్తున్నవేళ.. మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. వచ్చే ఏడాది మార్చిలో ఏపీలో ఎన్నికలు జరుగబోతున్నాయి.. ఈ క్రమంలో వాటిల్లో సత్తా చాటేందుకు టీడీపీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా.. వైసీపీ కూడా ఎన్నికలకు రెఢీ అవుతోంది.. దీంతో మరో రసవత్తర పోరు తప్పదనే ప్రచారం జరుగుతోంది..
వచ్చే ఎడాది మార్చిలో ఉభయ గోదావరి, అలాగే గుంటూరు, క్రిష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటి నుంచే వర్కౌట్ చేస్తోంది.. గుంటూరు క్రిష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు మాజీ మంత్రి ఆలపాటి రాజా పేరుని ప్రతిపాదిస్తోంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలలో అభ్యర్ది విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.. దాన్ని కూడా త్వరగా తేల్చి ప్రచారం నిర్వహించాలని కూటమి భావిస్తోంది..
మార్చిలో జరిగే ఎన్నికలకు వైసీపీ కూడా సిద్దమవుతోంది.. అప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదినెలలు అవుతుంది..ఆ సమయంలో ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంటుందని..అది మనకు ఉపయోగపడుతుందని.. వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు.. కూటమి ప్రభుత్వం ప్రజలకు, అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమలు చెయ్యలేదు..దీంతో ఓ వర్గం కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉంది..
అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతితోపాటు.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.. ఇంతవరకూ దాని ఊసే ఎత్తలేదు.. ఆ దిశగా ప్రచారం చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవచ్చనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.. దానికి తోడు ఇటీవల బెజవాడలో సంభవించిన వరదల విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలకు అండగా నిలవలేదన్న టాక్ కూడా వినిపిస్తోంది.. ఇవన్నీ పట్టభద్రులకు చేరవెయ్యగల్గితే.. విజయావకాశాలు మెండుగా ఉంటాయని వైసీపీలో జరుగుతున్న చర్చ.. వైసీపీ తరఫున పట్టభద్రుల ఎన్నికల్లో గుంటూరు విజయవాడల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు వైసీపీ కార్మిక నాయకుడు గౌతం రెడ్డి ఉత్సాహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది..
గోదావరి జిల్లాల్లో జరిగే ఎన్నికను వైసీపీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. 2023లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంలో ఉన్నవైసీపీకి ఇక్కడ పట్టభద్రులు షాకిచ్చారు. టీడీపీ అభ్యర్దులు గెలవడంతో.. రాష్టంలో టీడీపికి ఓ ఊపు వచ్చింది.. ఆసారి ఆ నియోజకవర్గంలో గెలిచేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న చర్చ జరుగుతోంది.. మొత్తంగా.. మార్చిలో మరో రసవత్తర పోరుకు ఏపీ సిద్దంగా ఉందన్నమాట..