మంగళగిరిలో ఆర్కేను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తా: వైఎస్ జగన్

-

ఏపీ సీఎం చంద్రబాబు అరాచన పాలనను ప్రజలు మరిచిపోకూడదని.. ఆయన అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు.

ఏపీలో ఇక మిగిలింది ఒక్క రోజే. ఇవాళ ఒక్క రోజే ప్రచారం చేసుకోవాలి. ఎల్లుండే పోలింగ్ కావడంతో ఇవాళ సాధ్యమైనంత మేరకు ప్రచారం చేయాలని ప్రధాన పార్టీలు ఆలోచిస్తున్నాయి. వైఎస్ జగన్ ఇవాళ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీ సీఎం చంద్రబాబు అరాచన పాలనను ప్రజలు మరిచిపోకూడదని.. ఆయన అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని జగన్ తెలిపారు.

ఆర్కేకు ఓటేసి గెలిపిస్తే నా కేబినేట్ లో మంత్రి పదవి ఇస్తా.. అని జగన్ హామీ ఇచ్చారు. దళితుల అసైన్డ్ భూములను లాక్కున్నారు. రైతుల భూములను గుంజుకొని చంద్రబాబు అమ్ముకున్నారు. ఆయన చేయని అవినీతి లేదు. ఇసుకను కూడా దోచుకున్నారు. నారా లోకేశ్ ఇక్కడ తిరిగారా ఏనాడైనా? కనీసం చంద్రబాబు పార్ట్ నర్ పవన్ పోటీ చేస్తున్న భీమవరం, గాజువాకలో చంద్రబాబు కానీ.. ఆయన కొడుకు నారా లోకేశ్ కానీ ఎందుకు ప్రచారం చేయడం లేదని జగన్ ఆరోపించారు.

అలాగే.. కుప్పంలో, మంగళగిరిలో చంద్రబాబు పార్ట్ నర్ ఎందుకు ప్రచారం చేయడంలేదు. దీన్ని బట్టి తెలుస్తోంది ఏమంటే.. వీళ్లిద్దరూ ఒకటే. వీళ్లది ఒకటే పార్టీ. ఐదేళ్ల పాలనలో రైతులను ఏనాడూ పట్టించుకోలేదు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను వంచించారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పేరుతో యువతను కూడా మోసం చేశారు.. అని జగన్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version