వైసీపీకి కంచుకోటల ఉన్న కడప జిల్లాలో పట్టు సడలకుండా వైసీపీ అధినేత జగన్ వ్యూహ్మతకంగా అడుగులు వేస్తున్నారు.. జడ్పీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని టీడీపీ ఎత్తులు వేస్తుంటే.. దాన్ని తిప్పికొట్టేందుకు జగన్ బరిలోకి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత జిల్లాలో జెడ్పీ చైర్మన్ పదవిని చేజార్చుకోకూడదనే ఆలోచనలో ఆయన ఉన్నారని తెలుస్తోంది..
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిని ఏకగ్రీవంగా గెలుచుకున్న వైసీపీ, అదే హవాను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీని రాజకీయంగా దెబ్బ తీయాలని టీడీపీ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ చేతిలో ఉన్న కడప జెడ్పీని సొంతం చేసుకోవాలని టీడీపీ ఎత్తుగడ వేస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. దీంతో నేరుగా వైసీపీ అధినేత జగన్ రంగంలోకి దిగారు.. వైసీపీ జెడ్పీటీసీ సభ్యులతో ఆయన నేరుగా మాట్లాడారట.. టీడీపీ మరో కుట్రకు పాల్పడుతుందని.. ఎవ్వరూ కూడా వారి ట్రాప్ లో పడొద్దని ఆయన చెప్పినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది..
గెలుపోటములు శాశ్వతమని.. వచ్చె ఎన్నికల్లో అధికారంలోకి ఖచ్చితంగా వస్తామనే భరోసాను వారికి జగన్ కల్పించారట.. జడ్పీ చైర్మన్ పీఠాన్ని చేజార్చుకుంటే.. ఇబ్బంది కరమైన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 50 జెడ్పీస్థానాలున్నాయి. వీటిలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ ఏకైక స్థానంలో గెలిచింది. టీడీపీలో ఐదుగురు, బీజేపీలో ఒక వైసీపీ సభ్యుడు చేరారు. ఏ రకంగా చూసినా వైసీపీ వైపు 40 మంది ఉన్నారు. అయితే కూటమి అధికారంలో వుండడంతో లాక్కుంటారనే అనుమానం వైసీపీలో వుంది. అందుకే వైసీపీ అధినేత జగనే.. నేరుగా రంగంలోకి దిగారని పార్టీవర్గాలు చెబుతున్నాయి..