మొన్నటి ఎన్నికల తరువాత ఏపీలో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థలపై గురిపెట్టింది. ఒక్కొక్కటిగా తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. కూటమి పార్టీల్లో తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్‌లెవల్లో బలమైన కేడర్ ఉంది.దీంతో ముందుగా టీడీపీ నేతలే స్థానిక సంస్థలను టార్గట్ చేస్తున్నారు. మిత్రపక్షాలైన జనసేన,బీజేపీ నేతలు అందుకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.
ఇప్పటికే విశాఖ,తిరుపతి,ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్‌లపై గురిపెట్టిన కూటమి నేతలు తాజాగా జగన్ సొంతి జిల్లా కడపను టార్గెట్‌గా పెట్టుకున్నాయి.ఆ జిల్లాలో వైసీపీ బలం ఎక్కువగా కనిపిస్తోంది.అయితే అక్కడి సంస్థలను స్వాధీనం చేసుకోవాలని టీడీపీ తహతహలాడుతోంది.ఈ నేపథ్యంలో కడప జడ్పీ పీఠాన్ని టీడీపీ ఖాతాలో వేయడానికి మంత్రాంగం ప్రారంభించారు.దీనిపై సమాచారం అందడంతో అలెర్ట్ అయిన జగన్ వెంటనే కీలక నేతలకు కబురు పంపారు.వెంటనే తాడేపల్లికి రావాలని గట్టిగా ఆదేశాలిచ్చారు.
నిన్ననే విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది.అక్కడ కూటమి పార్టీలు చివరి వరకు వ్యూహాలు అమలు చేసినా ఫలితం లేకుండా పోయింది. వైసీపీ ముందుగానే అప్రమత్తం కావడంతో ఓటర్లను కాపాడుకోగలిగింది.సంఖ్యా బలం లేని టీడీపీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది.అయితే ఇప్పుడు జగన్ సొంత జిల్లా కడప పైన గురి పెట్టారు కూటమి నేతలు.
కడప జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న ఆకేపాటి అమర్నాధ రెడ్డి మేలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో, ఆయన జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయగా కడప జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి టీడీపీ పావులు కదుపుతోంది. కడప జిల్లా పరిషత్‌లో 50 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. అందులో ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తరువాత అయిదుగు జెడ్సీటీసీలు టీడీపీలో చేరగా మరో జెడ్పీటీసీ బీజేపీకి దగ్గరయ్యారు. మిగిలిన జెడ్పీటీసీలతోనూ జిల్లాకు చెందిన టీడీపీ, బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. జగన్ ను తన సొంత జిల్లాలోనే దెబ్బ తీయానేలనేది ఈ రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
జిల్లాలోని రాజకీయ పరిణామాలపై పలువురు నేతలు వైసీపీ అధినేత జగన్‌కు వివరించారు. దీంతో ఎవంటనే అప్రమత్తమయ్యారాయన. జిల్లాలోని పార్టీకి చెందిన జెడ్పీటీసీలు అందరూ ఈ నెల 21న తాడేపల్లికి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. అలాగే వారిని తీసుకొచ్చే బాధ్యత పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. వారితో జగన్ నేరుగా సమావేశం కానున్నారు. వారికి భవిష్యత్ పైన భరోసా ఇస్తూ పార్టీ వీడకుండా మార్గదర్శకం చేయనున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీతో టచ్ లో ఉన్నారనే ప్రచారంతో వారితో జగన్ వ్యక్తిగతంగానూ మాట్లాడారు. దీంతో చాలామంది జడ్పీటీసీలు అధినేత మాటకు కట్టుబడి ఉంటామని చెప్పినట్లు సమాచారం. జడ్పీ పీఠం వైసీపీ చేజారకుండా చూసుకోవాలని కీలక నేతలకు జగన్ సూచించారు.సరైన సమయంలో జగన్ అప్రమత్తం కావడంతో కూటమి ప్రయత్నాలపై నీళ్ళు చల్లినట్లయింది. ప్రస్తుతం కడప జిల్లాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.