తిరుమల లడ్డుపై తాడో పేడో తేల్చుకునే లక్ష్యంలో జగన్

-

ముళ్లును ముళ్ళుతోనే తీయాలనేది సామెత. తిరుమల లడ్డు వివాదంలో వైసీపీ ఈ సామెతను ఫాలో అవుతోంది. కూటమి ప్రభుత్వంపై దైవభక్తినే అస్త్రంగా వాడేందుకు వైసీపీ సిద్ధమైంది. లడ్డు కల్తీ వ్యవహారాన్ని బైటపెట్టి వైఎస్ జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించగా అదే అస్త్రాన్ని చంద్రబాబు, పవన్ లపై రివర్స్ లో ప్రయోగించేలా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు జగన్.

ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డును గత వైసిపి పాలకులు అపవిత్రం చేసారని, జంతువుల కొవ్వుతో తయారుచేసిన కల్తీ నెయ్యిని ఉపయోగించారని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది.తిరుమల విషయంలో గత వైసిపి పాలకులు తప్పు చేసారని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతూ ఆ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు. ఈ క్రమంలో తాము ఏ తప్పు చేయలేదంటూ ఎదురుదాడికి దిగిన వైసిపి కూడా దేవాలయాలనే అస్త్రంగా ఉపయోగించుకుంటోంది.

కూటమి ప్రభుత్వం తిరుమలతో పాటు విజయవాడ వంటి ప్రముఖ ఆలయాల శుద్ది, ప్రత్యేక పూజలు చేయిస్తోంది. ప్రతిపక్ష వైసిపి కూడా ఇలాగే దేవాలయాల్లో పూజలకు సిద్దమైంది. ఈ నెల సెప్టెంబర్ 28న శనివారం రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసిపి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.కేవలం తెలుగు ప్రజలే కాదు దేశవ్యాప్తంగా వున్న హిందువులంతా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. అలాంటి ఆలయాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయాల కోసం వాడుకుంటోందని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. మరీముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేసారు.

వైసీపీ పాలకులే తిరుమల లడ్డును అపవిత్రం చేశారని టిడిపి, జనసేన,బిజెపి కూటమి నాయకులు అంటున్నారు. టిటిడి ఛైర్మన్లుగా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లను నియమించడమే తప్పని వారు క్రిస్టియన్లని ఆరోపిస్తున్నారు. వారిద్వారా హిందువుల పవిత్ర ఆలయం తిరుమలను అపవిత్రం చేయడానికి ఆనాటి సీఎం వైఎస్ జగన్ కుట్రలు పన్నారని కూటమి నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇక దీనిపై గొంతెత్తిన పవన్….ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయస్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.అపవిత్రపు కార్యకలాపాలు జరిగాయని ఆరోపిస్తూ … ఈ తప్పులను మన్నించాలంటూ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు.ఈ దీక్షపై వైసీపీ కౌంటర్లు పేలుస్తోంది. కూటమి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా పవన్ దీక్ష చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.కల్తీ వ్యవహారంపై తాడో పేడో తేల్చుకుంటామని స్ట్రాంగ్ గా చెప్తున్నారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news