అంతటా జగన్‌కే అనుకూలం

-

ముఖ్యమైన అంశం ఏమంటే చంద్రబాబు సొంత సామాజిక వర్గంలో కూడా ఒక బలమైన వర్గం ఈసారి జగన్ విజయం కోసం కృషిచేస్తున్నది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈ వర్గం చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నది.  ఇక చంద్రబాబుకు పాజిటివ్‌ అనుకున్న పవన్ కల్యాణ్ అంశం కూడా నీరుగారిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడుకి వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు వైసీపీ వైపు క్యూకట్టడమే ఇందుకు సూచన. ఎన్నికలకు ముందు జరిగే మార్పులు ఎన్నికల ఫలితాలను సూచిస్తాయి. వైసీపీలోకి వస్తున్నవారంతా స్వచ్ఛందంగా వస్తున్నారు. చంద్రబాబునాయుడు మాత్రం బలవంతంగా, రకరకాల తాయిలాలుచూపి పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇదే కాకుండా చంద్రబాబునాయుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య విశ్వసనీయతలేమి. ఆయన ఎన్ని పథకాలు తెచ్చినా, జగన్‌ను, కేసీఆర్‌ను, మోడీని ఎంత హోల్‌సేల్‌గా తిట్టినా జనం పెద్దగా పట్టించుకోవడంలేదని విశ్లేషకుల మాట. నాలుగేళ్లు మోడీతో సంసారం చేసిన బాబు ఇప్పుడు ఏం చెప్పినా జనం నమ్మడం లేదని వారి అభిప్రాయం.

మరో ముఖ్యమైన అంశం ఏమంటే చంద్రబాబు సొంత సామాజిక వర్గంలో కూడా ఒక బలమైన వర్గం ఈసారి జగన్ విజయం కోసం కృషిచేస్తున్నది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈ వర్గం చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నది.  ఇక చంద్రబాబుకు పాజిటివ్‌ అనుకున్న పవన్ కల్యాణ్ అంశం కూడా నీరుగారిపోయింది. చంద్రబాబుపై ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో ఆదోనిలో జరిగిన పవన్ కల్యాణ్ సభలోనే బట్టబయలయింది. మార్కెట్‌లో రైతులతో ముఖాముఖిలో ఒక రైతు, సమస్యలన్నీ చెప్పి జగనన్నను గెలిపిద్దామని చెప్పేసరికి పీకే గారు ఫ్లాట్‌. వాస్తవానికి పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలసి గతఎన్నికల్లోనే పనిచేశారు. పోయిన ఎన్నికల్లో మోడీ, పవన్ అంశాలు తోడై చంద్రబాబు చావుతప్పి కన్నులొట్టబోయిన చందాన బయటపడ్డారు. ఈసారి మోడీ లేడు. మోడీని సమర్థించే సామాజిక వర్గాలన్నీ తెలుగుదేశాన్ని ఎలాగైనా గద్దెదింపాలని పట్టుదలగా ఉన్నాయి.

పవన్ కల్యాణ్ చంద్రబాబుతో తెరవెనుక ఏమైనా చర్చలు జరిపారో లేదో కానీ చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను కొనేసినట్టుగానే ప్రచారం చేసింది. పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా బలహీనపర్చడంలో చంద్రబాబు వేసిన ఎత్తుగడలు బాగా పనిచేశాయి. దీంతో పవన్ తొలుత సృష్టించిన రాజకీయ సంచలనం క్రమంగా చల్లబడుతూ వస్తున్నది. పవన్ సామాజిక వర్గం కూడా ఈసారి ఓట్లు చీలి చంద్రబాబుకు మేలు జరుగకూడదన్న భావనకు వస్తోందని మరో విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. ఎటు చూసినా చంద్రబాబుకు ప్రతికూలాంశాలే కనిపిస్తున్నాయి. అందుకే ఆయన చాలా డెస్పరేట్‌గా, అనిశ్చితితో మాట్లాడుతున్నాడు.

మోడీని ఒక దయ్యంగా చూపించి, జగన్‌కు లేని కుట్రలు ఆపాదించి, జరగని పొత్తులను చూపించి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. పథకాల పేరుతో నేరుగా డబ్బుల పంపిణీ చేస్తున్నారు. జగన్ మనుషులపై విపరీతంగా పోలీసు దమనకాండను అమలు చేస్తున్నాడు. ఇటీవల ఒక పోలీసు ఉన్నతాధికారి, మరో సెఫాలజిస్టు ఒక పెళ్లి వేడుకలో కలిశారు. ఇద్దరూ ఎన్నికల సర్వేల గురించి బాగా తెలిసిన వారే. ఆంధ్రలో పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఏమైనా అధ్యయనం చేశారా అని ఆ పోలీసు అధికారి సెఫాలజిస్టును అడిగారు. ఈరోజున్న పరిస్థితి అయితే చంద్రబాబు ఘోరంగా ఓడిపోబోతున్నారు. వైసీపీకి 120 స్థానాల దాకా వస్తున్నాయి. ఈ ట్రెండు ఎన్నికలదాకా ఇలాగే ఉంటే చంద్రబాబు పని అయిపోయినట్టే అని సెఫాలజిస్టు కుండబద్దలు కొట్టారు. జాతీయస్థాయి సర్వేల్లో కూడా అలాగే వస్తున్నది అని అక్కడ ఉన్న ఇతర అధికారులు మాట్లాడుకుంటున్నారు. మోడీతో కలిసి చంద్రబాబు మాట్లాడిన అంశాలేవీ జనం మరచిపోలేదు. ప్రత్యేకహోదా ఏమైనా మంత్రదండమా..? ప్యాకేజీలరూపంలో అంతకంటే ఎక్కువే తెస్తున్నామన్న మాటలు ఏపీ ప్రజలందరికీ గుర్తున్నాయి. అదే జగన్‌ తొలిరోజు నుండీ ప్రత్యేకహోదా అన్నమాటను వదిలిపెట్టకపోవడం ఆయన పట్టుదలకు, నిబద్ధతకు నిదర్శనంగా ప్రజలు భావిస్తున్నారని ఆ అధికారి విశ్లేషణ. ఇప్పుడు బాబు అమలు చేస్తున్న పథకాలు కూడా జగన్ వల్లనే వచ్చాయని జనం బాహాటంగానే అంటున్నారు. ఇప్పటిదాకా ఏమీచేయని పెద్దమనిషి, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని పల్లెల్లో చర్చ జరుగుతున్నది.

అయినా చంద్రబాబు ఏదో ఒకటి చేస్తాడని ఆయన సామాజిక వర్గం వారు, కొందరు తెలుగుదేశం నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు బలాన్ని ఎక్కువగా ఊహించుకోవడం వల్ల ఇటువంటి ఆశాభావం ఉండడంలో తప్పు లేదు. నిజానికి తెలుగుదేశం క్యాడర్‌ అంతా ఓడిపోతామేమో అనే టెన్షన్‌లో ఉంది. ప్రతీ నాయకుడి, కార్యకర్త బాడీలాంగ్వేజ్‌లో ఆ బెరుకు బయటపడిపోతోంది. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిన సంఘటన 2004లో చూశాం. మొన్న నరేంద్రమోడీ కాలికి బలపం కట్టుకుని తిరిగినా, మూడు రాష్ర్టాల ప్రజలు చీకొట్టి కాంగ్రెస్‌ను గెలిపించారు. నిజంగానే చంద్రబాబునాయుడికి ఈ ఎన్నికలు నౌ ఆర్‌ నెవర్‌.  ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ గెలవలేము అన్న ఆరాటంతో ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఓడిపోతే ఇక బాబు భవిష్యత్తు పూర్తిగా భూస్థాపితమే. తెలుగుదేశం పరిస్థితి కూడా. వారసుడి తెలివితేటలు చూస్తే, స్వహస్తాలతో సర్వనాశనం చేసేట్లు, క్యాడర్‌ మొత్తం కుమ్ములాటలతో మురిగిపోయేట్లు కనబడుతోంది. ఇక జగన్ పరిస్థితి కూడా నల్లేరు మీద నడకేమీ కాదు. ఇప్పుడు గెలవకపోతే జగన్ కూడా 2024ఎన్నికల దాకా ఈ పార్టీని నిలబెట్టాలంటే చాలా కష్టపడాల్సిఉంటుంది. తనకీ డూ ఆర్‌ డై పోరాటమే. కానీ చంద్రబాబు నాయుడి నెగటివ్స్‌ అన్నింటినీ విస్తృతంగా ప్రచారం చేయడం, ఆయన పోల్‌ మేనేజ్‌మెంట్‌ స్ట్రాటజీని అనుక్షణం తెలుసుకుంటూ, తదనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటూపోతే తప్పక గెలుపు పలుకరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news