వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డికి ధైర్యం ఎక్కువ. తాను చేయాలనుకున్నది మొండి పట్టుదలతో చేసేస్తుంటాడు. ఈ గట్సే రాజకీయాల్లో ఆయన నిలబడేలా చేశాయి. ఒకరి సహాయం తీసుకోకుండా ఒక్కడిగానే ముందుకెళ్లడం ఆయనకు మొదటి నుంచీ అలవాటుగా మారింది. కాంగ్రెస్‌తో విబేధించి పార్టీ పెట్టిన జగన్ పొత్తు లేకుండానే 2014 ఎన్నికల్లో తన పార్టీని పోటీకి నిలబెట్టారు. అప్పుడు జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కింది.
2019లో కూడా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళిన జగన్ తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. ప్రత్యర్ధులు ఎంతమంది కలిసి వచ్చినా మరోసారి 2024 ఎన్నికల్లోనూ ఆయన ఒంటరిగానే బరిలోకి దిగారు. ఈసారి ఫలితాల గురించి అటుంచితే జగన్ డేరింగ్ స్టెప్ తీసుకుంటారనేది విశ్లేషకుల భావన. ఇప్పుడు ఢిల్లీలో కూడా జగన్ ఒంటరిగా ధర్నా చేయగా వివిధ రాజకీయ పార్టీల నాయకుల మద్ధతును గెలుచుకున్నారు. జాతీయ స్థాయిలో జగన్‌కి ది తొలివిజయం అని విశ్లేషకులు అంటున్నారు.
ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న దారుణాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపై ఢిల్లీ వేదికగా సమర శంఖం పూరించారు జగన్. 2019 నుంచి 2024 ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన వైయస్ జగన్ ఎవరి సహాయ సహకారాలు అవసరం లేకుండా ఒంటరిగానే ముందుకు వెళ్లారు.
పార్టీ పెట్టిన నాటి నుంచి ఒంటరిగానే ప్రయాణం చేసిన వైయస్ జగన్ ఇప్పుడు అధికారాన్ని కోల్పోవడంతో ఒంటరి ప్రయాణం సాధ్యమేనా అని ఆలోచిస్తున్న తరుణంలో తొమ్మిది రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు జగన్‌కు అండగా నిలవడం ఆయన్ను సంతోషానికి గురిచేసింది. ఢిల్లీ వేదికగా జగన్ నిర్వహించిన ధర్నా సక్సెస్ కావడం ఎన్నికల ఓటమి తర్వాత జగన్ సాధించిన తొలి విజయమని నేషనల్ మీడియా చెప్తోంది. ఇదే సమయంలో తానుఅనుకున్న లక్ష్యాలను కూడా జగన్ చేరుకున్నారని నేషనల్ మీడియా అంటోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి ఢిల్లీ వేదికగా దేశ ప్రజలందరికీ తెలియజేయడంలో జగన్ విజయం సాధించారనే చెప్పాలి. తన ధర్నాకు ఊహించని విధంగా 9 రాజకీయ పార్టీల మద్దతు లభించడం ద్వారా రెండో విజయాన్ని అందుకున్నారు జగన్. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదిపార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్ ధర్నాకు తొలిరోజే సంఘీభావం తెలపడంతో వైసీపీ దేశం దృష్టిని ఆకర్షించింది.
అన్నాడిఎంకే మినహాయించి ఇండికూటమిలోని పార్టీలు జగన్ ధర్నాకు సంఘీభావంగా నిలిచాయి. తాజా పరిణామాలతో జగన్ ఏదైనా జాతీయ కూటమిలో భాగస్వామి అవుతారా అని టాక్ నడుస్తోంది. అయితే జగన్ స్కెచ్ వేరే ఉందని వైసీపీ పెద్దల ద్వారా తెలుస్తోంది. ఒంటరిగానే జాతీయ స్థాయిలో రాజకీయంగా అద్భుతం చేయబోతున్నారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ వేదికగా జగన్ మొదటిసారి ధర్నా చేసి సూపర్ సక్సెస్ అయ్యారని మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. సంతోషాన్ని, కొత్త ఆలోచనలు ఇచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.