ఏపీలో అధికార వైసీపీలో నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఏ మాత్రం తగ్గడం లేదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య రచ్చ నడుస్తూనే ఉంది.. ఒకటి, రెండు నియోజకవర్గాల్లో ఈ రచ్చ ఉంటే పర్లేదు.. కానీ రాష్ట్రంలో చాలా చోట్ల నేతల మధ్య రచ్చ నడుస్తోంది.. ఈ రచ్చ ఒకోసారి బయటపడుతుంది కూడా.. అంతర్గతంగా కుమ్ములాటలు ఉంటే ఎలాగోలా సర్దిచెప్పవచ్చు.. కానీ నేతలు బహిరంగంగానే రచ్చకు దిగుతున్నారు.
చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం, సీటు కోసం నేతల మధ్య వార్ నడుస్తోంది. ఇదే క్రమంలో వైసీపీకి కంచుకోటగా ఉన్న గుంటూరు ఈస్ట్ లో కూడా రచ్చ మొదలైంది. అసలు ఇక్కడ అంతర్గత పోరు అనేది పెద్దగా ఎప్పుడు జరగలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రచ్చ మొదలైంది. 2014, 2019 ఎన్నికల్లో ఈ సీటు వైసీపీనే గెలుచుకున్న విషయం తెలిసిందే.
ముస్తఫా వైసీపీ తరుపున గెలుస్తూ వస్తున్నారు… వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ రచ్చ లేదు…వైసీపీ అధికారంలోకి వచ్చాక రచ్చ మొదలైంది. పక్కన ఉన్న గుంటూరు వెస్ట్ లో ఎలాగో నేతల మధ్య పోరు నడుస్తోంది. టీడీపీ నుంచి గెలిచిన మద్దాలి గిరి వైసీపీ వైపుకు రావడంతో…అసలు గొడవ మొదలైంది. ఇక్కడ వైసీపీ తరుపున ఓడిపోయిన చంద్రగిరి యేసురత్నంకు..మద్దాలి అంటే పడటం లేదు. అలా అక్కడ గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి.
అయితే కంచుకోట లాంటి ఈస్ట్ లో కూడా అదే పరిస్తితి…ఎమ్మెల్యే ముస్తఫాకు, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ సజీలకు పడటం లేదు. ముస్లిం వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తుందట. ఈ మధ్య నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా…ప్రతిదానికి పోటీ వస్తున్నవంటూ…సజీపై ఫైర్ అయ్యారట. తనని కాదని ఏమి చేయలేవంటూ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం..ఇక దీనిపై సజీ వర్గం…వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మొత్తానికైతే కంచుకోటలో కూడా నేతలు రచ్చ లేపుతున్నారు.