సాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. విజయంపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాగర్‌లో గ్రామాల వారీగా పోలింగ్ సరళి లెక్కలు చూసిన టీఆర్ఎస్ పరిస్థితి ఊహించినంత ఈజీగా ఏమీ లేదన్న మాట పార్టీ నేతల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏ పార్టీ అయినా.. తక్కువ మెజార్టీతోనే గెలిచే అవకాశాలు స్పష్ఠంగా కనిపిస్తున్నాయి.
నాగార్జున సాగర్ పోలింగ్ ముగియడంతో పార్టీలు గెలుపోటములపై లెక్కలేసుకుంటున్నాయి. సాగర్ బై ఎలక్షన్ లో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆరెస్ మధ్యనే ఉండటం ఎవరు గెలిచిన తక్కువ మెజారిటీ తోనే గెలిచే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. దీంతో రెండు పార్టీలు… మండలాలు, గ్రామాల వారీగా పోలింగ్ సరళి లెక్కలు తెప్పించుకుంటున్నాయి. గెలుపోటముల లెక్కలేసుకుని మాదంటే, మాది గెలుపని మెజార్టీపై అంచనాలు వేసుకుంటున్నాయి.
సాగర్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అధికార టీఆర్ఎస్ అన్ని అస్త్రాలను ప్రయోగించింది. అభ్యర్థిని ప్రకటించకముందే నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ఎమ్మెల్యేలను ఇంఛార్జీలుగా నియమించి, మంత్రులతో వరుస పర్యటనలు చేయించింది. ఎన్నికల ప్రకటనకు ముందే.. సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించి వరాల జల్లులు కురిపించారు. ఆ తరువాత తీవ్ర తర్జనభర్జనల నడుమ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సిహ్మయ్య తనయుడికి టికెట్ ఇచ్చారు. అయితే అటు వైపు సీనియర్ నేత జానారెడ్డి ఉండటంతో పాటు ఎలాగైన గెలవాలని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. అందుకే జానా విజయాన్ని అందరూ నేతలు తమ భుజాలపై వేసుకుని ప్రచారం నిర్వహించారు.
బరిలో ప్రధానరాజకీయ పార్టీలున్నా పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే కనిపిస్తోంది. పైగా భారీగా పోలింగ్ నమోదు కావడం కూడా ఆసక్తికరంగా మారింది. ఓ వైపు టీఆర్ఎస్ ప్రభుత్వ లబ్దిదారులను లిస్ట్ ఆధారంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించింది. ప్రభుత్వ పథకాలే తమ గెలుపు కృషి చేస్తాయని చెబుతున్నారు. అయితే జానారెడ్డి లోకల్ నేత కావడం..భగత్ నాన్ లోకల్ కావడం ఇక్కడ కొంత మేర ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. ఇక యాదవ సామాజికవర్గానికి చెందిన భగత్‌కి టిక్కెట్ ఇవ్వడం తమకి అనుకూలంగా మారుతుందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి..
నిరుద్యోగులు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీఆర్ఎస్కు ప్రతి బంధకంగా మారనున్నాయి. కారును పోలిన గుర్తులు ట్రాక్టర్, చపాతీ రోలర్ గుర్తులు కూడా కారు పార్టీని ఆందోళన గురి చేస్తున్నాయ్. బీజేపి అభ్యర్థి గిరిజనుడు కావడం, ఎమ్మెస్పీ అభ్యర్థి, ఫీల్డ్ అసిస్టెంట్ బరిలో ఉండడం టీఆర్ఎస్కి ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. మొత్తంగా విజయం ఎవరిది అనేది మే 2న తేలనుంది.