బీఆర్ఎస్ డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తోందని, కానీ తాము ప్రజలను నమ్ముకొని చేస్తున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని అధికార బీఆర్ఎస్ నేతలకు తెలుసునని, అందుకే వారు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నారు. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తున్నది తాము కాదని, బీఆర్ఎస్ పార్టీయే అనీ అన్నారు. ఎవరు డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. కాంగ్రెస్ 72 నుంచి 78 సీట్లలో గెలిచి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
”నాకు కేసీఆర్ చిరకాల మిత్రుడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొంతకాల మిత్రుడు. మాపై ఖమ్మం, అశ్వారావుపేటలో కేసీఆర్ విమర్శలు చేశారు. ఆయన మా కంటే తెలివైన వారు. సాహిత్యం తెలిసిన వారు. ఇలా మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎవడో అర్భకుడు రాసిచ్చినది ఎలా చదివారు. మేం కరకట దమనులం అయితే మా కోసం 3 నెలలు ఎందుకు తిరిగారు? ఆ అర్భకుడు చెప్పిన వాటిని ఎలా చదివారో వారి విజ్ఞతకే వదిలేశా. నేను ఏ పదవిలో ఉన్నా వాటికీ వన్నె తెచ్చా. నా చిరకాల కోరిక గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా ప్రజల కాళ్ళు కడగటమే. ఈ నెల 17న పినపాక నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పర్యటనను జయప్రదం చేయండి” అని పిలుపునిచ్చారు తుమ్మల నాగేశ్వరరావు.