తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వందే భారత్ రైలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య కొత్తగా ప్రవేశ పెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది కాదని, కేవలం ధనికులకు ఉపయోగపడేదని పొన్నాల ఆరోపించారు. పండగపూట రాజకీయాలు మాట్లాడకూడదనుకున్నానని కానీ, మాట్లాడక తప్పడం లేదన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని, ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్ అందరూ ఒక రైలుకు విస్తృత ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు.
వందే భారత్ రైలును సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగింపుగా ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించారన్నారు. కానీ, ఇది మొదటి రైలు కాదని, ఇప్పటి వరకు రోజు, వారాంతాల్లో నడిచేవి ఇప్పటి వరకు 17 రైళ్లు ఉన్నాయని, వందే భారత్ 18వది అని పొన్నాల విమర్శించారు.