కేసీఆర్ బంధువులు భూములు కబ్జా చేస్తే చర్యలు ఉండవా..? అని మాజీ పీసీసీ ఛీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. అయోధ్య రామ మందిరానికి విరాళమిచ్చిన ఆయన రాముడు అందరి వాడు.. రాముడికి రాజకీయాలను ఆపాదించటం సరైంది కాదని అన్నారు. రామ మందిర నిర్మాణానికి ఒక లక్షా నూట పదహారు రూపాయల విరాళం ప్రకటించారు ఆయన. నా పెన్షన్ నుంచి రాముడి ఆలయానికి విరాళం ఇస్తున్నామన్నాఆయన భారత రాష్ట్రపతి ద్వారా నా విరాళం పంపిస్తున్నానని అన్నారు.ఇక సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ అని పేర్కొన్న అయన కేసీఆర్ సీఎం పదవి నుండి తప్పుకుని కొడుక్కి పట్టం కట్టబెట్టే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోందని అన్నారు.
కేసీఆర్ అవినీతి బయట పడుతుంది అని ఢిల్లీకి భయపడుతున్నారన్న పొన్నాల బీజేపీ ఒత్తిళ్లకు సీఎం పదవి నుండి దిగిపోతున్నారని అన్నారు. పదవి నుండి దిగిపోయాక కేసులు వేస్తే సానుభూతితో ఓట్లు పొందే కుట్ర కూడా కేసీఆర్ చేస్తున్నాడని అన్నారు. దేవుడి పేరుతో ప్రాజెక్టులు కడితే అవినీతి అడగరు అని అనుకుంటున్నారని అసలు డీపీఆర్ లు ఇవ్వకుండా ప్రాజెక్టులు కట్టేశారని ఆయన అన్నారు. అవినీతి బయట పడుతుందని డీపీఆర్ ఇవ్వడం లేదని అన్నారు. జగన్ నీళ్ల దోపిడీ బయట పడుతుందని డీపీఆర్ లు ఇవ్వడం లేదని అన్నారు.