ఉగ్ర కార్యకలాపాలకు నిధుల సమీకరణతో పాటు భారత్ లో మతకల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్ర సర్కార్ నిషేధం విధించింది. పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
ఇటీవలే.. భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి కుట్ర పన్నిందని ఎన్ఐఏ తన నివేదికలో వెల్లడించింది. మరోవైపు, ఈ సంస్థపై నిషేధం విధించాలని ఆల్ ఇండియా బార్ అసోసియేషన్.. కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.