పోస్టాఫీస్ దేశంలో ఉన్న పౌరులకు డబ్బును పొదుపు చేసుకునేందుకు అనేక రకాల పథకాలను అందిస్తోంది. అయితే వాటిల్లో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్‌పీఎల్ఐ) పథకం కూడా ఒకటి. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులోకి తెచ్చారు. 1995 నుంచే ఈ పథకం అమలులో ఉంది.
ఈ పథకం కింద డబ్బును పొదుపు చేసుకుంటే పాలసీదారుడికి 80 ఏళ్ల వయస్సు వచ్చాక పాలసీ మెచూర్ అవుతుంది. అదే పాలసీదారుడు చనిపోతే మెచూరిటీ మొత్తం అతని నామినీకి అందుతుంది. ఇందులో 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు చేరవచ్చు. కనీసం రూ.10వేలను గరిష్టంగా రూ.10 లక్షలను ఇందులో పొదుపు చేయవచ్చు. పాలసీ 4 ఏళ్లు అయ్యాక లోన్ సదుపాయం అందిస్తారు. అలాగే 3 ఏళ్ల తరువాత పాలసీ సరెండర్ సదుపాయం ఉంటుంది. కానీ 5 ఏళ్ల లోపు పాలసీని ఉపసంహరించుకుంటే బోనస్ ఇవ్వరు.
ఏడాదికి బోనస్
ఈ పథకంలో చేరేందుకు అవసరం అయితే వయస్సును 50, 55, 58, 60 ఏళ్ల వరకు పొడిగిస్తారు. ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు పాలసీ తీసుకుంటే 60 ఏళ్ల వరకు పాలసీ కట్టవచ్చు. ఈ క్రమంలో రూ.1000కి రూ.60 బోనస్ ఇస్తారు.
ప్రీమియం ఎంత ?
ఆర్‌పీఎల్ఐ స్కీమ్ కింద 30 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల వరకు ప్రీమియం కడితే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ అనుకుంటే నెలకు రూ.1045 ప్రీమియం కట్టాలి. మొత్తం 30 ఏళ్లకు రూ.9 లక్షల బోనస్ ఇస్తారు. దీంతో అసలు రూ.5 లక్షలు, బోనస్ రూ.9 లక్షలు కలిపి రూ.14 లక్షలు చెల్లిస్తారు.
బోనస్ ఎలా లెక్కిస్తారు ?
ఏడాదికి రూ.1000కి బోనస్ రూ.60 ఇస్తారు. అంటే రూ.1 లక్షకు రూ.6వేలు అవుతుంది. అదే రూ.5 లక్షలకు అయితే రూ.30వేలు ఇస్తారు. దీన్ని 30 ఏళ్లకు లెక్కిస్తే.. 30,000 * 30 = రూ.9 లక్షలు అవుతుంది. ఇలా బోనస్‌ను చెల్లిస్తారు.