రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తీర్పును జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం గత నెలలో రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ సెప్టెంబర్ 3న వాదనలు ముగిశాయి. పిటిషనర్‌తో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున వాదనలు విన్న జస్టిస్ రామకృష్ణన్ ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా జస్టిస్ రామకృష్ణన్, నిపుణుడు సైబల్ దాసు గుప్త లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు వెలువరించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమని పేర్కొంది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టవద్దని ఆదేశించింది. డిటైల్ట్ ప్రాజెక్టు రిపోర్ట్ (డి.పి.ఆర్) తదితర అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన విషయాన్ని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం ప్రస్తావించింది. గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటీషన్ పై ఎన్జిటి ఈ మేరకు ఆదేశించింది.