అద్దంకిలో వైసీపీ నేతల రచ్చ.. ఎమ్మెల్యేకి షాకిచ్చిన అధికారులు !

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. తెలుగు దేశం పని అయిపోయిందని భావిస్తున్న కొందరు, అలానే వ్యాపారాలు నడవడం లేదని భావిస్తున్న మరికొందరు నేతలు అధికార పార్టీకి బేషరతు మద్దతు ఇచ్చి బయట నుండి మద్దతు ఇస్తునారు. అలా చేయడం వలన ముందు నుండి ఉన్న వైసీపీ క్యాడర్ వారిని గౌరవించలేని పరిస్థితి. ఇలా చీరాల, గన్నవరం నియోజకవర్గాలలో చాలా సార్లు బయట పడింది కూడా. అయితే తాజాగా అద్దంకిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది.

అద్దంకిలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్, అద్దంకి వైసీపీ ఇన్ ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య అనుచరులు ఒకరికొకరు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కరణం బలరామ్ పుట్టిన రోజు సందర్భంగా కరణం వెంకటేష్, బలరాం ఫ్లెక్సీలని వారి అనుచరులు ఏర్పాటు చేశారు. దీనికి పోటీగా అద్దంకి ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కృష్ణ చైతన్య అనుచరులు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ అధికారులు కరణం బలరామ్ ఫ్లెక్సీలకి అనుమతి లేదంటూ వాటిని తొలగించారు. అయితే ఎమ్మెల్యే అని కూడా గౌరవం లేకుండా ఇలా ఫ్లెక్సీలు తొలగించడం సరికాదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.