కరోనా బాధితులు హోం క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా చేస్తే తొందరగా క్యూర్ అవుతారు..!?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజుకీ 3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ కొరత.. కరోనా బాధితులతో ఆస్పత్రులు నిండిపోయాయి. రోజురోజుకీ కేసుల తీవ్రత పెరగడంతోపాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువౌతు వస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు.. కరోనా బాధితులకు తగిన సూచనలు సలహాలు అందజేస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటేనే ఆస్పత్రుల్లో జాయిన్ అవ్వమని చెబుతున్నారు. కరోనా లక్షణాలు నార్మల్‌గా ఉండి ఉంటే ఇంట్లోనే హోం క్వారంటైన్ చేసుకుని తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్యులు ఇంటికే వచ్చి చికిత్స అందిస్తారని చెబుతున్నారు. అయితే చాలా మందికి హోం క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల గురించి ప్రత్యేకంగా తెలియదు. హోం క్వారంటైన్ చికిత్స పొందుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

క్వారంటైన్
క్వారంటైన్

కరోనా లక్షణాలను గుర్తించండి..
కరోనా సెకండ్ వేవ్ తర్వాత కరోనా లక్షణాల్లో చాలా మార్పులు వచ్చాయి. సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్, అలసట, తలనొప్పి, గొంతులో గరగర, కోరింత దగ్గు, నాలుక రుచి కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పెదాలు ఎండిపోవడం, నాలుకపై దద్దుర్లు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఒక వేళ పాజిటివ్ అని వచ్చినప్పుడు వెంటనే హోం ఐసోలేషన్‌ చేసుకోవాలి. తగిన జాగ్రత్తలు, నియమాలు పాటిస్తూ.. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.

పాజిటివ్ వస్తే ఆలస్యం చేయకండి..
కరోనా లక్షణాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ జ్వరం, దగ్గు, జలుబు అని నెగ్లెట్ చేయడం కుదరదు. ఒకవేళ మీకు కరోనా ఉంటే.. మీతోపాటు మీ కుటుంబ సభ్యులకు వైరస్ సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అందుకే కరోనా లక్షణాలు కనిపించిన మరుక్షణం పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలి. అప్పుడే వైరస్ వేరే వాళ్లకు సోకకుండా ఉంటుంది. వైద్యులు తెలిపే సూచనలు, సలహాలు పాటిస్తుండాలి.

క్వారంటైన్‌లో ఇలా చేయండి..
పాజిటివ్ వచ్చినప్పుడు హోం క్వారంటైన్‌లో ఉండే గదికి వెంటిలేషన్ ఉండాలి. గాలి ప్రవాహం జరుగుతూ ఉండాలి. కరోనా బాధితులు వాడే ప్రతి వస్తువుపై కరోనా వైరస్ ఉంటుంది. వాటితో జాగ్రత్తగా ఉండాలి. తగిన విశ్రాంతి, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వేడి నీళ్లు తాగాలి. రోజూ వ్యాయామం చేస్తుండాలి. క్వారంటైన్ గదిని తరచూ హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తుండాలి. గది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తరచూ శానిటైజర్‌లో చేతులు శుభ్రం చేసుకోవాలి. అప్పుడే కరోనా నుంచి తొందరగా క్యూర్ అవ్వగలరు.