చిత్రం : ప్రేమ పిపాసి
నటీనటులు : జీపీఎస్ (బావ), కపిలాక్షి మల్హోత్ర (బాల), సోనాక్షి, సుమన్ తదితరులు
దర్శకత్వం : మురళీ రామస్వామి
నిర్మాత : పీఎస్ రామకృష్ణ
బ్యానర్ : ఎస్‌ఎస్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్, రాహుల్ భాయ్ మీడియా, దుర్గ శ్రీ ఫిల్మ్
మ్యూజిక్ : ఆర్ఎస్
సినిమాటోగ్రఫి : తిరుమల్ రోడ్రిగుజ్
ఎడిటింగ్ : ఎస్‌జే శివ కిరణ్
రిలీజ్ డేట్ : 2020-03-13
రేటింగ్ : 1.5/5
ప్రేమకథలకు వెండితెరపై ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే వాటిని తెరకెక్కించే విధానంలో కొత్త దనం ఉంటే ప్రేక్షకుల బ్రహ్మరథం పడతారు. అదే కోవలో చేరేందుకు ప్రేమ పిపాసి అంటూ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.
కథ
ప్రేమంటూ అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటాడు జీపీఎస్ (బావ). అతను ఎంచుకునే అమ్మాయిలు సైతం బావను ఉపయోగించుకుంటారు. అయితే ఇలా బావ తనను వాడుకునే అమ్మాయిలను ట్రాప్ చేసి మోసం చేస్తుంటాడు. ఆ క్రమంలో శ్రుతీ, కోమలి, కీర్తిలను మోసం చేస్తాడు. చివరకు బాలా (సోనాక్షి)ను చూసి నిజంగా ప్రేమించడం మొదలు పెడతాడు. మరి చివరకు బాలా ప్రేమను గెలిచాడా? వీరిద్దరి మధ్య ఉన్న గతం ఏంటి? చివరకు వీరిద్దరి కథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ప్రేమ పిపాసిని చూడాల్సిందే.
నటీనటులు పర్ఫామెన్స్..
ప్రేమ పిపాసిలో బావ (జీపీఎస్) బాల (కపిలాక్షి మల్హోత్ర) పాత్రనే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అతనికి తొలి సినిమా కావడంతో కొన్ని సీన్స్‌లో తేలిపోయినట్టు కనిపిస్తుంది. డ్యాన్సులు, ఫైట్స్‌లో ఏమాత్రం జోష్ కనిపించదు. ఇక ఎమోషనల్ సీన్స్‌లో అయితే అతి కష్టంగా నటించినట్టు కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యతనే ఇచ్చారు. సొనాక్షి నటనలో తేలిపోయినా.. కనిపించినంత సేపు బాగానే ఆకట్టుకుంది. సుమన్ ఈ క్యారెక్టర్‌ను ఎందుకు చేశాడు? ఆ గెటప్ ఏంటి? అనే ప్రశ్నలు ప్రేక్షకుడికి తలెత్తుతాయి. ఇక సినిమా ఆద్యంతం తన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు ఫన్ బకెట్ భార్గవ్. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ
ప్రేమకథలోని కొత్త కోణాన్ని, నేటి యువతను ఆకట్టుకునే ప్రేమకథలను అందించడానికి యువ దర్శకులు తెగ తాపత్రయ పడుతున్నారు. అయితే ఇలా యువతను ఆకట్టు కోవాలనే ఉద్దేశ్యంతో అడల్డ్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోతున్నారు. ప్రేమ పిపాసిలోనూ అదే కనిపిస్తుంది. ఓ దశలో ఇదేంట్రా బాబు అది తప్ప ఇంకేం చూపించడం లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది.
అయితే యూత్‌ను ఆకట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్‌ను ఎక్కడా మిస్ కాకుండా చూసుకోవడంతో ఓ మోస్తరుగా మెప్పించే అవకాశం ఉంది. ఈ తరం అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఎందుకు ప్రేమిస్తున్నారు? అవసరం తీర్చుకునేందుకు ఎలాంటి దారులు తొక్కుతున్నారు? అనే అంశాలను వినోదాత్మకంగా తెరకెక్కించాడు. ప్రథమార్థం మొత్తం ఇలాంటి సీన్స్‌తోనే నింపేసిన దర్శకుడు సెకండాఫ్‌లో కథను సీరియస్ మోడ్‌లో నడిపించాలనుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆసక్తికరంగా లేకపోవడంతో నిరాశ కలుగుతుంది.
ప్రేమ పిపాసి చిత్రంలోని పాటలు అంతగా మెప్పించకపోయినా.. బోర్ కొట్టించవు. నేపథ్యం సంగీతం గురించి చెప్పుకునేంతగా లేదు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. సినిమాటోగ్రఫర్ విశాఖ బీచ్ అందాలను బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టున్నాయి.
చివరగా.. ప్రే(కా)మ పిపాసి!