సైనిక ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కోసం బయట ఎదురుచూస్తున్న మద్దతుదారులకు కనిపించేందుకు కొద్ది సేపు బయటకు వచ్చారు. ఆస్పత్రి ఆవరణలో కారులో చక్కర్లు కొట్టారు. అమెరికా జాతీయ జెండాను పట్టుకొని… మద్దతుదారులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు ట్రంప్. అయితే ఇలా చికిత్స పొందుతున్న ట్రంప్ కాసేపు బయటకు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది పూర్తిగా కరోనా నిబంధనలకు విరుద్ధమంటున్నారు కొందరు. ట్రంప్ ప్రయాణించిన కారులో వైరస్ సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కారులో ఆయనతో పాటు ప్రయాణించిన మరో ఇద్దరికి వైరస్ సోకే ప్రమాదం ఉందని అది తెలిసి కూడా ఇలా తప్పు చేయడం ఏమటని విమర్శిస్తున్నారు. కరోనా గురించి తాను ఎంతో నేర్చుకున్నానన్న ట్రంప్ నిబంధనల్ని ఎలా మరిచిపోయారని ఎద్దేవా చేస్తున్నారు ఇంకొందరు. ఇప్పటికే కరోనా సోకినా మారవా అని ఆయనని ప్రశ్నిస్తున్నారు.